Hindu Wedding: భార్య మరో పెళ్లి చేసుకుందని కోర్టుకెక్కిన భర్తకు షాకిచ్చిన జడ్జి

  • సప్తపది లేకుండా హిందువుల వివాహానికి సంపూర్ణత లేదని వ్యాఖ్య
  • అలా జరిగిన వివాహాన్ని గుర్తించలేమని స్పష్టం చేసిన అలహాబాద్ హైకోర్టు
  • ఈ కేసులో విడాకులనే ప్రశ్నే ఉత్పన్నం కాదని వెల్లడి
Hindu Wedding Not Valid Without Saat Pheras Says Allahabad High Court

తనకు విడాకులు ఇవ్వకుండా మరో పెళ్లి చేసుకుందని కోర్టుకెక్కిన ఓ భర్తకు అలహాబాద్ హైకోర్టు షాకిచ్చింది. సప్తపది లేకుండా జరిగిన పెళ్లి చెల్లదని స్పష్టం చేసింది. హిందూ వివాహాలలో సప్తపదికి విశేష ప్రాముఖ్యం ఉందని, ఆ తంతు జరగకుండా వివాహానికి సంపూర్ణత రాదని పేర్కొంది. ఈ కేసులో విడాకులు తీసుకోలేదనే ప్రశ్నే ఉత్పన్నం కాదంటూ పిటిషన్ ను తోసిపుచ్చింది. హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 సెక్షన్ 7 ప్రకారం.. వధూవరులు ఇద్దరూ హిందూ ఆచార వ్యవహారాల ప్రకారం వివాహ తంతును పూర్తిచేసినపుడే ఆ జంటను భార్యాభర్తలుగా పరిగణించాలని కోర్టు పేర్కొంది. వివాహ తంతులో సప్తపది ముఖ్యమైన కార్యక్రమమని, ఈ కార్యక్రమం లేకుండా జరిగిన పెళ్లి చెల్లదని వివరించింది.

గుజరాత్ కు చెందిన సత్యం సింగ్, స్మృతి సింగ్ 2017లో వివాహం చేసుకున్నారు. తర్వాత కొంతకాలానికి అత్తింటి నుంచి వెళ్లిపోయిన స్మృతి సింగ్.. అదనపు కట్నం కోసం సత్యం సింగ్ తనను వేధిస్తున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసు విచారణలో ఉండగా తన భార్య మరో పెళ్లి చేసుకుందని సత్యం సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై మీర్జాపూర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. కోర్టు విచారణ జరుపుతోంది. అయితే, సత్యం పిటిషన్ చెల్లదంటూ స్మృతి అలహాబాద్ కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ విచారించిన హైకోర్టు.. సత్యం, స్మృతిల మధ్య జరిగిన వివాహం చెల్లదని, దీంతో స్మృతి సింగ్ మరో వివాహం చేసుకున్నారనే ప్రశ్నే ఉత్పన్నం కాదంటూ పిటిషన్ కొట్టేసింది.

More Telugu News