Venkaiah Naidu: అధికారం శాశ్వతం కాదు, ప్రత్యర్థులను వేధించొద్దు: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

Venkaiah Naidu advices against resorting to political vendetta
  • మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ పుస్తకావిష్కరణ సభకు ముఖ్య అతిథిగా వెంకయ్యనాయుడు
  • సమకాలీన రాజకీయాలపై పలు వ్యాఖ్యలు చేసిన మాజీ ఉపరాష్ట్రపతి
  • రాజకీయాల్లో ప్రత్యర్థులు తప్ప శత్రువులు ఉండకూడదని వ్యాఖ్య 
  • దుర్భాషలాడే నేతలకు ఓటుతో సమాధానం చెప్పాలని ప్రజలకు పిలుపు

అక్రమార్జనకు, ప్రత్యర్థులను వేధించడానికి అధికారాన్ని అడ్డుపెట్టుకోరాదని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హితవు పలికారు. అధికారం శాశ్వతం కాదని అన్నారు. ఉమ్మడి రాష్ట్ర మాజీ హోంమంత్రి, మాజీ ఎంపీ తూళ్ల దేవేందర్ గౌడ్.. రాజ్యసభ, శాసనసభల్లో చేసిన ప్రసంగాల ఆధారంగా రూపొందించిన పుస్తకాల ఆవిష్కరణ సభ బుధవారం హైదరాబాదులోని జూబ్లీహిల్స్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తాజా రాజకీయ పరిణామాలపై స్పందించారు. 

రాజకీయాల్లో అధికార, విపక్ష నేతలు ప్రత్యర్థులుగా ఉండాలే గానీ శత్రువులుగా ఉండకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. ద్వేషపూరిత, కుట్రపూరిత రాజకీయాలు వద్దని చెప్పారు. ప్రజాతీర్పును, ప్రతిపక్షాలను గౌరవించాలన్నారు. కొంతమంది నేతలు నోరు విప్పితే దుర్భాషలేనని, కర్త, కర్మ, క్రియ అన్నీ అసభ్య పదాలేనని చెప్పారు. ప్రజాప్రతినిధుల వ్యవహారశైలిని ప్రజలు గమనించి కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ఓటు వేయాలని సూచించారు. అసభ్యంగా మాట్లాడేవారికి పోలింగ్ బూత్‌లో సమాధానం చెప్పాలని పేర్కొన్నారు. తాను, దివంగత జైపాల్‌రెడ్డి ముఖ్యమంత్రులపై ఎన్ని విమర్శలు చేసినా అవి విషయానికి లోబడే ఉండేవని, ఇప్పుడు ఆ స్థాయి విమర్శలను సహించే పరిస్థితి లేదని విచారం వ్యక్తం చేశారు. 

ఈ సందర్భంగా దేవేందర్ గౌడ్‌‌పై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రశంసల వర్షం కురిపించారు. దేవేందర్ గౌడ్ ఆదర్శవంతమైన నాయకుడన్న ఆయన పది శాఖలకు దేవేందర్ గౌడ్ మంత్రిగా పనిచేసినా ఎలాంటి మచ్చ లేకుండా కొనసాగారని అన్నారు. పదిమందికి ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే ఈ పుస్తకాలను తీసుకొచ్చినట్టు దేవేందర్ గౌడ్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News