Roja: లోకేశ్! నీ భార్య బ్రాహ్మణిని ఏమన్నారో చూడు: మంత్రి రోజా కంటతడి

  • లోకేశ్ మద్దతుతో అయ్యన్న, బండారు రెచ్చిపోయారని విమర్శ
  • ఎన్టీఆర్‌‌కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు మద్దతు ఎలా ఇచ్చావని బండారుకు ప్రశ్న
  • జగన్‌ను సైకో అంటే ఎలా ఒప్పుకుంటామని నిలదీత
  • బండారు మాటలు చూశాక మహిళలు చెప్పులతో కొడతారన్న రోజా
Minister Roja tears after bandaru comments

తన క్యారెక్టర్‌ని జడ్జ్ చేయడానికి బండారు సత్యనారాయణ ఎవడు? అతనికి ఏం హక్కులు ఉన్నాయి? నన్ను తిట్టించడానికి బండారును, అయ్యన్న పాత్రుడ్ని టీడీపీ నేత నారా లోకేశ్ ఎంకరేజ్ చేస్తున్నాడు, కానీ.. అదే అయ్యన్న నీ భార్యని ఏమన్నాడో చూశావా? లోకేశ్ అంటూ మంత్రి రోజా నిప్పులు చెరిగారు. ఆమె మంగళవారం మీడియాతో మాట్లాడుతూ కంటతడి పెట్టుకున్నారు.

ఎన్టీఆర్ కుటుంబాన్ని అనేశారు కాబట్టి తాను రోజాను విమర్శించానని బండారు చెప్పారని, కానీ ఆయనకు రాజకీయ భిక్ష పెట్టిన ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన, చెప్పులేసిన, పార్టీ లాక్కున్న చంద్రబాబుకు ఎలా మద్దతు ఇచ్చావ్? అని ప్రశ్నించారు. ఎన్టీఆర్ చావుకు కారణమైన చంద్రబాబు కాళ్లు ఎందుకు నొక్కుతున్నావ్? అని నిలదీశారు. ఆ రోజు నీ పౌరుషం చూపించాలి కదా అన్నారు. కానీ ఎన్టీఆర్‌కు అన్నం కూడా పెట్టని కూతుళ్లు, కొడుకులు, అల్లుళ్లు, మనవరాళ్ల గురించి మాట్లాడుతున్నావా? అని దుమ్మెత్తి పోశారు.

ఈ రోజు మేం కూడా ఎన్టీఆర్ గురించే పోరాడుతున్నామన్నారు. ఆయనకు అన్నం పెట్టని, చెప్పులేసిన ప్రాణాలు తీసిన చంద్రబాబు కోసం రోడ్లమీదకు వచ్చి నందమూరి కుటుంబం డ్రామాలు చేస్తోందని, కానీ అదే ఎన్టీఆర్‌కు అన్యాయం జరిగినప్పుడు మీరు ఎక్కడకు వెళ్లారని తాము ప్రశ్నించామని, ఇందులో తప్పేముందన్నారు. తప్పు చేస్తే ఎవరూ ప్రశ్నించవద్దా? అన్నారు. ప్రశ్నిస్తే నా క్యారెక్టర్ పైన రాళ్ళేస్తారా? అని ప్రశ్నిస్తూ రోజా కంటతడి పెట్టుకున్నారు.

లోకేశ్! అయ్యన్న బ్రాహ్మణిని ఏమన్నాడో చూడు...

అసలు నువ్వెవడు నా క్యారెక్టర్ గురించి జడ్జ్ చేయడానికి? నీకేం హక్కు ఉంది? ఈ రోజు లోకేశ్ తెలుసుకోవాలి... ఇలాంటి అయ్యన్న, బండారును ఎంకరేజ్ చేసి, తనను తిట్టించి నా నోరు మూయించాలనుకున్నావని, కానీ ఈ రోజు నీ పరిస్థితి ఏమయింది? అన్నారు. అదే అయ్యన్న నీ భార్య బ్రాహ్మణిని ఏమన్నాడో చూడు, బాలకృష్ణ కూతురు, లోకేశ్ పెళ్లాం, అదెవరు? దాని పేరు ఏంటి? అన్నాడన్నారు. కాబట్టి నాపై దుమ్మెత్తి పోయాలనుకుంటే అది మీ కళ్లల్లోనూ పడిందన్నారు. ఈరోజు అదే పరిస్థితి నీ పెళ్లానికి వచ్చిందన్నారు. బ్రాహ్మణి కూడా ఈ విషయం తెలుసుకోవాలన్నారు.

జగన్‌ను సైకో అంటే ఎలా ఒప్పుకుంటాం?

తాను హీరోయిన్‌గా ఉన్నప్పుడు బ్రాహ్మణి చాలా చిన్నపాప అని, ఆమెకు తామే జడలు వేసి, ఆడించుకునే వారమన్నారు. ఆమె ఇంత వరకు రాజకీయాలు మాట్లాడలేదు కాబట్టి మేమూ మాట్లాడలేదని, కానీ ఇప్పుడు చంద్రబాబు, లోకేశ్ ఇచ్చిన స్క్రిప్ట్ తీసుకొని జగన్‌ను సైకో అంటే తాము ఎలా అంగీకరిస్తామని ప్రశ్నించారు.

టీడీపీ వాళ్లు నా గొంతు నొక్కాలనుకుంటే మీ వల్ల కాదని టీడీపీని ఉద్దేశించి అన్నారు. తన ప్రాణం ఉన్నంత వరకూ జగన్‌కు మద్దతుగా, మహిళలకు మద్దతుగా తన గళం వినిపిస్తూనే ఉంటానన్నారు. ఇకపై తప్పుడు మాటలు మాట్లాడితే.. కచ్చితంగా ఈసారి వదిలేది లేదని, ఎంతవరకైనా పోరాడతానని హెచ్చరించారు. బండారును అరెస్ట్ చేసినంత మాత్రాన వదిలేది లేదని, ఆయనపై పరువునష్టం దావా వేస్తానన్నారు. న్యాయపోరాటం చేస్తానన్నారు. మహిళల గురించి దిగజారుడుగా మాట్లాడాలంటే భయపడేవిధంగా ముందుకు సాగుతానన్నారు.

చెప్పులతో కొడతారు

బండారు మాట్లాడిన మాటలు చూస్తే ఈ రోజు మహిళలు చెప్పులతో కొడతారన్నారు. కానీ టీడీపీలోని మహిళలు మాత్రం ఆయన వ్యాఖ్యలను స్వాగతిస్తున్నారన్నారు. మీ ఇంట్లోని సభ్యులను ఎవరైనా ఇలా మాట్లాడితే ఊరుకుంటారా? అని ప్రశ్నించారు. మాట్లాడితే సినిమా వాళ్లు అంటారని, ఎన్టీఆర్ ఎక్కడి నుంచి వచ్చారన్నారు. బండారు భార్యను అడుగుతున్నానని, ఆ రోజే నీ భర్తను చెప్పుతో కొట్టి ఉంటే ఇలాంటి ఆలోచన రాకపోయి ఉండేదన్నారు. లోకేశ్ వీరి మాటలను సపోర్ట్ చేయడం సిగ్గుచేటు అన్నారు. తాను మంత్రిగా ఎదిగితే చూసి ఓర్వలేకపోతున్నారన్నారు.

More Telugu News