Nara Lokesh: నారా లోకేశ్ పై రేపటి సీఐడీ విచారణ ఈ నెల 10కి వాయిదా

  • ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేశ్ కి 41ఏ కింద సీఐడీ నోటీసులు
  • హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన లోకేశ్
  • ఇరు వర్గాల వాదనలు విన్న ఏపీ హైకోర్టు
CID questioning on Nara Lokesh adjourned to Oct 10

ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో ఏపీ సీఐడీ అధికారులు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు ఇటీవల 41ఏ కింద నోటీసులు ఇవ్వడం తెలిసిందే. లోకేశ్ అక్టోబరు 4న విచారణకు హాజరు కావాలంటూ ఆ నోటీసుల్లో స్పష్టం చేశారు. 

అయితే ఈ నోటీసుల్లోని కొన్ని అంశాలపై లోకేశ్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. 41ఏ నోటీసులోని కొన్ని అంశాలను ఆయన సవాల్ చేశారు. లోకేశ్ పిటిషన్ పై ఈ మధ్యాహ్నం తర్వాత విచారణ చేపట్టిన హైకోర్టు... ఇరు వర్గాల వాదనలు వింది. 

లోకేశ్ పై రేపటి సీఐడీ విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది. ఈ మేరకు ఏపీ సీఐడీకి ఆదేశాలు ఇచ్చింది. 10వ తేదీన లోకేశ్ సీఐడీ విచారణకు హాజరు కావాలని స్పష్టం చేసింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే విచారించాలని హైకోర్టు ధర్మాసనం తన ఆదేశాల్లో పేర్కొంది. సీఐడీ అధికారులు విచారణ జరిపే సమయంలో లోకేశ్ న్యాయవాదిని కూడా అనుమతించాలని సూచించింది. మధ్యాహ్నం గంట సేపు లంచ్ బ్రేక్ ఇవ్వాలని పేర్కొంది. 

ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో విచారణకు హాజరయ్యేటప్పుడు హెరిటేజ్ సంస్థ లావాదేవీలకు సంబంధించిన వివరాలు, అకౌంటు పుస్తకాలు తీసుకురావాలని ఇటీవల సీఐడీ తన నోటీసుల్లో పేర్కొంది. 

అయితే, హెరిటేజ్ ఫుడ్స్ లో డైరెక్టర్ పదవికి తాను ఎప్పుడో రాజీనామా చేశానని, అలాంటప్పుడు ఆ సంస్థ లావాదేవీల వివరాలు, పద్దుల పుస్తకాలు తానెలా తీసుకువస్తానని లోకేశ్ అంటున్నారు. ఈ మేరకు తన లంచ్ మోషన్ పిటిషన్ లో ప్రస్తావించారు.

More Telugu News