Posani Krishna Murali: పవన్ కల్యాణ్ గతంలో టీడీపీని తీవ్రస్థాయిలో విమర్శించిన వీడియోలు పంచుకున్న పోసాని

  • టీడీపీతో పొత్తుపై బాహాటంగా ప్రకటించిన పవన్ కల్యాణ్
  • గతంలో చంద్రబాబు, లోకేశ్ పై అవినీతి ఆరోపణలు చేసి ఇప్పుడెలా కలుస్తావన్న పోసాని
  • పవన్ ఏ లెక్కన రాజకీయ నాయకుడు అంటూ ఆశ్చర్యం 
Posani shares Pawan Kalyan previous comments video clippings

ఇటీవలి పరిణామాల నేపథ్యంలో జనసేనాని పవన్ కల్యాణ్ టీడీపీతో తమ పొత్తు ఉంటుందని బాహాటంగా ప్రకటించడం తెలిసిందే. పవన్ ప్రకటన వెలువడినప్పటి నుంచి టీడీపీ కార్యక్రమాలకు జనసైనికులు, జనసేన కార్యక్రమాలకు టీడీపీ కార్యకర్తలు హాజరవుతున్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది జనసేన-టీడీపీ సంకీర్ణమేనని నిన్న అవనిగడ్డలో పవన్ ఉద్ఘాటించారు. ఈ నేపథ్యంలో, వైసీపీ నేత, ఏపీ ఎఫ్ డీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి స్పందించారు. పవన్ కల్యాణ్ గతంలో టీడీపీ అధినాయకత్వాన్ని ఏకిపారేసిన వీడియో క్లిప్పింగ్ లను పంచుకున్నారు. 

పవన్... చంద్రబాబును, లోకేశ్ ను తీవ్ర పదజాలంతో ఘాటుగా విమర్శించడం ఆ వీడియోల్లో చూడొచ్చు. 

"కొడితే తెలుగుదేశం పార్టీ కుంభస్థలాన్నే కొట్టాలి... తెలుగుదేశం పార్టీ తల వంచాలి, తెలుగుదేశం పార్టీ వాళ్లు నోరు అదుపులో పెట్టుకోవాలి, బాబు మళ్లీ రావాలి అంటూ హోర్డింగ్స్ కనిపిస్తున్నాయి... వచ్చి ఏంచేస్తారు మీరు? ఏం ఆశించకుండా మేం మీకు మద్దతుగా నిలిస్తే, నన్ను బూతులు తిట్టించారు, నా తల్లిని దూషించారు... మాట్లాడితే పవన్ కల్యాణ్ సినిమా యాక్టర్ అంటారు... మీ అబ్బాయి లోకేశ్ కు ఏంతెలుసు? పంచాయతీ ఎన్నికల్లో కూడా పోటీ చేయని వ్యక్తిని పంచాయతీరాజ్ మంత్రిని చేశారు? మీ కొడుకును ముఖ్యమంత్రిని చేయడానికా జనసేన మీకు కాపు కాస్తోంది? మీ అబ్బాయి లోకేశ్ చేస్తున్న అవినీతి మీకు తెలుసా? ఒకవేళ మీకు తెలిసే చేయిస్తున్నారా? టీడీపీ నేతలు సిగ్గు, లజ్జ, పౌరుషం అనే మాటలు మర్చిపోయారు... అలాంటి పుట్టుక కూడా ఒక పుట్టుకేనా? నేను మీకు అండగా ఉండి పశ్చిమ గోదావరి జిల్లాలో 15 సీట్లు టీడీపీకి అందించాను.. కానీ మీరు నా తల్లిని దూషించారు... టీడీపీని, లోకేశ్ ను క్షమించను... ఖబడ్దార్..." అంటూ పవన్ గతంలో చేసిన వ్యాఖ్యలు ఈ వీడియో క్లిప్పింగ్స్ లో ఉన్నాయి. 

దీనిపై పోసాని స్పందిస్తూ, చంద్రబాబు, లోకేశ్ అవినీతికి పాల్పడిన తీరును గణాంకాలతో సహా చెప్పింది పవన్ కల్యాణే అని అన్నారు. కానీ, ఇప్పుడు మళ్లీ చంద్రబాబును సీఎం చేస్తానని అంటున్నాడని విమర్శించారు. నేను ఎంఏ చదివాను, ఎంఫిల్ చదివాను, ఇంకేదో చదివాను కానీ... పవన్ కల్యాణ్ తీరు మాత్రం అర్థం కాలేదని పోసాని వ్యంగ్యం ప్రదర్శించారు. అసలు, పవన్ కల్యాణ్ ఏ లెక్కన రాజకీయ నాయకుడు? అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మరి, ఇన్ని తప్పులు చంద్రబాబు, లోకేశ్ చేశాడంటున్నావ్ కదా... జగన్ ఏమైనా ఇన్ని తప్పులు చేశాడా? అని పవన్ ను ప్రశ్నించారు.

More Telugu News