KTR: దేశంలోనే తొలి సోలార్ రూఫ్ సైక్లింగ్ ట్రాక్ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

  • హైదరాబాదు అవుటర్ రింగ్ రోడ్డుపై సైక్లింగ్ ట్రాక్
  • అత్యాధునిక సౌకర్యాలతో 23 కి.మీ మేర ట్రాక్ నిర్మాణం
  • ఇలాంటిది మొదట దక్షిణ కొరియాలో ఏర్పాటు చేశారన్న కేటీఆర్
  • పూర్తిగా అధ్యయనం చేశాక హైదరాబాదులో ట్రాక్ నిర్మించామని వెల్లడి
KTR inaugurates first solar roof cycling track in India

హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డులో హెచ్ఎండీఏ నిర్మించిన సోలార్ రూఫ్ సైక్లింగ్ ట్రాక్ ను తెలంగాణ మంత్రి కేటీఆర్ ఈ సాయంత్రం ప్రారంభించారు. హెల్త్ వే కార్యాచరణలో భాగంగా 23 కిలోమీటర్ల మేర ఈ సైక్లింగ్ ట్రాక్ ను ఏర్పాటు చేశారు. ఇది దేశంలోనే మొట్టమొదటి గ్రీన్ ఫీల్డ్ సోలార్ రూఫ్ సైక్లింగ్ ట్రాక్. 

అవుటర్ రింగ్ రోడ్డుపై నార్సింగి-గండిపేట మార్గంలో 4.25 మీటర్ల వెడల్పుతో మూడు లేన్లలో దీన్ని నిర్మించారు. ఈ ట్రాక్ నిర్మాణానికి రూ.100 కోట్ల వ్యయం అయినట్టు తెలుస్తోంది. ఈ ట్రాక్ పై సోలార్ రూఫ్ ఉండడం వల్ల ఇది సూర్యరశ్మిని ఉపయోగించుకుని 16 మెగావాట్ల విద్యుచ్ఛక్తిని ఉత్పత్తి చేస్తుంది. 

ట్రాక్ పొడవునా కెమెరాల నిఘా ఏర్పాటు చేశారు. ట్రాక్ మధ్యలో ఫుడ్ కోర్టులు, రెస్ట్ రూమ్స్, తాగునీటి సదుపాయాలు, సైకిల్ రిపేర్ షాపులు, కిరాయికి సైకిళ్లు ఇచ్చే స్టోర్లు కూడా ఏర్పాటు చేశారు. ట్రాక్ పొడవునా పూల మొక్కలు కనువిందు చేస్తాయి.

ఈ ట్రాక్ ను ప్రారంభించిన సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గతంతో పోల్చితే ఇప్పుడు ప్రజలు సుఖజీవనానికి అలవాటు పడుతున్నారని వెల్లడించారు. ఆదాయం పెరిగే కొద్దీ బండ్లు, కార్లు వస్తున్నాయని, హైదరాబాదులోని పెద్ద అపార్ట్ మెంట్లలో ఉండేవారికి ఒక ఇంట్లోనే రెండు కార్లు ఉంటున్నాయని వివరించారు. అలాంటివారికి శారీరక శ్రమ ఏముంటుందని అన్నారు. సైక్లింగ్ ద్వారా ఎంతో వ్యాయామం లభిస్తుందని కేటీఆర్ పేర్కొన్నారు. 

ఈ సైక్లింగ్ ట్రాక్ తో ఎవరికి లాభం? ఇక్కడివారికే ఇది ఉపయోగపడుతుంది అని అంటున్నారని, కానీ ఇది కేవలం ప్రారంభం మాత్రమేనని అన్నారు. మున్ముందు ఇలాంటివే మరిన్ని ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. భవిష్యత్తులో అంతర్జాతీయ సైక్లింగ్ రేసులు కూడా ఇక్కడ జరగొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. 

దక్షిణ కొరియాలో ప్రపంచంలోనే మొట్టమొదటి సోలార్ రూఫ్ సైక్లింగ్ ట్రాక్ ఏర్పాటు చేశారని, తమ బృందం అక్కడికి వెళ్లి పూర్తిగా అధ్యయనం చేసి వచ్చిందని వెల్లడించారు. కొరియా సైక్లింగ్ ట్రాక్ లో కొన్ని లోపాలను తమ బృందం గుర్తించిందని, అలాంటి లోపాలు లేకుండా హైదరాబాదులో సోలార్ రూఫ్ సైక్లింగ్ ట్రాక్ నిర్మించామని కేటీఆర్ చెప్పారు.

More Telugu News