Iran: ఆకాశంలో విమానాలు దారి తప్పితే..? 15 రోజుల్లో 20 విమానాలకు ఎదురైన అనుభవం

  • జీపీఎస్ తప్పుడు సంకేతాలతో పైలట్లు అయోమయం
  • ఇరాన్ గగనతలం పైనుంచి వెళుతుండగా సమస్య
  • తాము ఎక్కడ ఉన్నామంటూ ఏటీసీ అధికారులను ప్రశ్నించిన పైలట్లు
20 Civilian Passenger Flights Went Off Course In Iranian Airspace

కొత్త ప్రదేశాలకు వెళ్లాలంటే జీపీఎస్ సాయం తీసుకోవడం సహజమే.. మనం వెళ్లాల్సిన దారిని జీపీఎస్ తప్పుగా చూపిస్తే ఇబ్బందులు తప్పవు. ఆ పరిస్థితిలో రోడ్డు మీద కనిపించే వారిని అడుగుతూ గమ్యం చేరుకోవచ్చు. మరి ఆకాశంలో ఎగిరే విమానాలు దారి తప్పితే..? పూర్తిగా జీపీఎస్ పై ఆధారపడి దూసుకెళ్లే విమానానికి తప్పుడు సంకేతాలు అందితే.. అలా ఎలా జరుగుతుందని అనుకుంటున్నారా.? అలాగే జరిగింది. ఒకటి రెండు కాదు.. ఏకంగా 20 విమానాలు ఈ సమస్యను ఎదుర్కొన్నాయి. అది కూడా ఇటీవల పదిహేను రోజుల వ్యవధిలో మాత్రమే. దీంతో జీపీఎస్ తప్పుడు సంకేతాలకు సంబంధించి ఎయిర్ ఫోర్స్ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. 

ఇరాన్ గగనతలం పైనుంచి ఇటీవల ప్రయాణించిన 20 విమానాలు జీపీఎస్ స్పూఫింగ్ కు గురయ్యాయని అధికారులు తెలిపారు. దీంతో తాము ఎక్కడ ఉన్నాము.. ఎటు వెళుతున్నామనే విషయం తెలియక గందరగోళానికి గురయ్యామని సదరు విమానాల పైలట్లు చెప్పారు. తమ లొకేషన్ వివరాల గురించి ఇరాన్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) అధికారులను అడిగి తెలుసుకున్నామని వివరించారు. అప్పుడు సమయం ఎంతవుతోందనే విషయంపైనా కాసేపు గందరగోళం నెలకొందని పేర్కొన్నారు.

ఇలా ఎందుకు జరిగిందంటే..
విమాన ప్రయాణాల్లో జీపీఎస్ కీలకం.. టేకాఫ్ నుంచి ల్యాండింగ్ వరకు విమానం ప్రతీ క్షణం జీపీఎస్ తో కనెక్ట్ అయి ఉంటుంది. ఫ్లైట్ నేవిగేషన్ వ్యవస్థకు అనుసంధానమై పైలట్లకు మార్గం చూపుతుంది. ప్రయాణ మార్గంలో వివిధ దేశాల జీపీఎస్ వ్యవస్థలతో లింక్ అవుతూ విమానానికి దారి చూపుతుంది. అయితే, ఇరాన్ లో జీపీఎస్ స్పూఫింగ్ జరిగిందని, జీపీఎస్ తప్పుడు సంకేతాలను చూపించిందని పైలట్లు తెలిపారు. సాధారణ ప్యాసింజర్ విమానాలపై ఇలాంటి దాడి జరగడం అత్యంత అరుదని నిపుణులు చెబుతున్నారు. ఈ దాడికి గురైన విమానాల్లో బోయింగ్ 777, 737, 747 సహా పలు ప్రైవేటు విమానాలు కూడా ఉన్నాయని అధికారులు చెప్పారు. అయితే, ఇరాన్ ఏటీసీ అధికారుల గైడెన్స్ తో ఈ విమానాలకు ముప్పు తప్పిందని సమాచారం. కేవలం 15 రోజుల వ్యవధిలో 20 విమానాలపై ఇలా దాడి జరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మరోమారు ఇలాంటి దాడులు జరగకుండా చర్యలు తీసుకున్నట్లు వివరించారు.

More Telugu News