RJD Leader: రిజర్వేషన్లు లిప్ స్టిక్ వేసుకునే మహిళలకే.. ఆర్జేడీ నేత వివాదాస్పద కామెంట్లు

  • మహిళా బిల్లులో ఓబీసీ కోటా లేకపోవడాన్ని ప్రశ్నించిన అబ్దుల్ బారీ సిద్ధిఖి
  • వెనకబడిన వర్గాల మహిళలకు కచ్చితమైన కోటా ఉండాలని డిమాండ్
  • మండిపడుతున్న ప్రతిపక్షాలు.. మిత్రపక్షాల నేతల అసహనం
RJD Leaders Bizarre Speech On Women Reservation

చట్టసభలలో మహిళలకు రిజర్వేషన్ కల్పించాలంటూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మహిళా బిల్లుకు శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. దీంతో ఈ బిల్లు ప్రస్తుతం చట్టంగా మారింది. అయితే, ఈ చట్టం ఇప్పట్లో అమలు చేయలేమని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. జనగణన, నియోజకవర్గాల పునర్విభజన పూర్తయ్యాకే మహిళా రిజర్వేషన్ చట్టం అమలు చేయడం సాధ్యమని తెలిపింది. ఇదిలా ఉండగా.. మహిళా రిజర్వేషన్ చట్టంపై ఆర్జేడీ సీనియర్ నేత, లాలూ ప్రసాద్ యాదవ్ సన్నిహితుడు అబ్దుల్ బారీ సిద్ధిఖి సంచలన వ్యాఖ్యలు చేశారు.

కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఈ చట్టంతో కేవలం లిప్ స్టిక్ వేసుకున్న మహిళలకే ప్రయోజనమని అన్నారు. చట్టంలో ఓబీసీ మహిళలకు కోటా లేకపోవడంపై కేంద్రాన్ని నిలదీస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వెనకబడిన వర్గాల మహిళలకు చట్టంలో తగిన కోటా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. బీహార్ లోని ముజఫర్ పూర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, రాష్ట్ర మాజీ మంత్రి కూడా అయిన అబ్దుల్ బారీ సిద్ధిఖీ వ్యాఖ్యలపై ప్రస్తుతం దుమారం రేగుతోంది.

ఆయన వ్యాఖ్యలు మహిళా రిజర్వేషన్లకు వ్యతిరేకమంటూ ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు. మిత్ర పక్షాల నేతలు కూడా అబ్దుల్ బారీ సిద్ధిఖీపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఆర్జేడీ అధికార ప్రతినిధి అజాజ్ అహ్మద్ సిద్ధిఖి మాత్రం అబ్దుల్ బారీ సిద్ధిఖీని సమర్థించారు. వెనకబడిన వర్గాల మహిళలకు తగిన ప్రాధాన్యం కల్పించకపోతే మహిళా రిజర్వేషన్ చట్టంతో న్యాయం జరగదని అజాజ్ అహ్మద్ విమర్శించారు. అబ్దుల్ బారీ సిద్ధిఖీ వ్యాఖ్యలను సరిగా అర్థం చేసుకోకుండా ప్రతిపక్ష నేతలు రాజకీయం చేస్తున్నారని అజాజ్ అహ్మద్ సిద్ధిఖి ఆరోపించారు.

More Telugu News