Pakistan: పాకిస్థాన్ రక్తసిక్తం.. ఆత్మాహుతి దాడిలో 50 మందికిపైగా మృతి

  • బలూచిస్థాన్ ప్రావిన్సులోని మస్తుంగ్ జిల్లాలో ఘటన
  • మహ్మద్ ప్రవక్త జయంతిని పురస్కరించుకుని భక్తులు ర్యాలీకి సిద్ధమవుతుండగా దాడి
  • ఈ నెలలో ఇక్కడ జరిగిన రెండో అతిపెద్ద ఘటన ఇదే
  • తమకు  సంబంధం లేదన్న పాకిస్థాన్ తాలిబన్ సంస్థ
52 killed in suicide blast in Balochistan

ఆత్మాహుతి దాడితో పాకిస్థాన్ మరోమారు దద్దరిల్లింది. బలూచిస్థాన్ ప్రావిన్సులోని మస్తుంగ్ జిల్లాలో నిన్న జరిగిన ఆత్మాహుతిదాడిలో 52 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 50 మందికిపైగా గాయపడ్డారు. మహ్మద్ ప్రవక్త జయంతిని పురస్కరించుకుని భక్తులు ర్యాలీకి సమాయత్తం అవుతుండగా ఓ ఉగ్రవాది తనను తాను పేల్చేసుకున్నాడు. పేలుడు కారణంగా భారీ శబ్దం వినిపించినట్టు ఏసీపీ తెలిపారు. ఈ ఘటనతో అక్కడ భీతావహ పరిస్థితులు నెలకొన్నాయి. మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి. శరీర భాగాలు తునాతునకలయ్యాయి. మృతుల్లో డీఎస్పీ గష్కోరీ కూడా ఉన్నట్టు అధికారులు తెలిపారు.

ఈ ఆత్మాహుతి దాడికి ఇప్పటి వరకు ఎవరూ బాధ్యత ప్రకటించలేదు. ఈ పేలుడుతో తమకు సంబంధం లేదని ‘ది పాకిస్థాన్ తాలిబన్’ (టీటీపీ) స్పష్టం చేసింది. ముస్తుంగ్‌లో ఈ నెలలో జరిగిన రెండో అతిపెద్ద పేలుడు ఇదేనని అధికారులు తెలిపారు. ఇటీవల జరిగిన పేలుడులో జామియత్ ఉలేమా-ఇ-ఇస్లామ్ ఫజల్ నేత హఫీజ్ హమ్దుల్లా సహా పలువురు గాయపడ్డారు.

More Telugu News