POCSO: లైంగిక కార్యకలాపాల కనీస వయసుపై లా కమిషన్ కీలక సూచనలు

  • దేశంలో లైంగిక కార్యకలాపాల కనీస వయసు 18 ఏళ్లు
  • 16 ఏళ్లకు తగ్గించాలన్న ప్రతిపాదనలపై లా కమిషన్ నివేదిక
  • 18 ఏళ్ల వయసు కంటే తగ్గించడం సరికాదని స్పష్టీకరణ
  • బాల్య వివాహాలు, అక్రమ రవాణా పెరిగిపోతాయని ఆందోళన
Law Commission submits report to central govt

దేశంలో లైంగిక సంబంధాలకు కనీస వయసు 18 సంవత్సరాలు అని పోక్సో చట్టం చెబుతోంది. నిర్దేశిత వయసు కంటే తక్కువ వయసున్న బాలబాలికలకు ఈ నిబంధన రక్షణ కల్పిస్తుంది. 18 ఏళ్ల కంటే తక్కువ వయసున్న బాలలతో లైంగిక కార్యకలాపాలు నేరం అని పోక్సో చట్టంలో పేర్కొన్నారు. బాలల అంగీకారంతో లైంగిక కార్యకలాపాలు జరిపినప్పటికీ అది చట్ట విరుద్ధమే అవుతుంది.

అయితే ఈ వయసును 16 సంవత్సరాలకు తగ్గించాలన్న వాదనలు ఎప్పటినుంచో ఉన్నాయి. పలు కోర్టులు కూడా లైంగిక కార్యకలాపాల సమ్మతికి కనీస వయసును తగ్గించాలని కోరాయి. దీనిపై జాతీయ లా కమిషన్ కేంద్రానికి కీలక సూచనలు చేసింది. లైంగిక కార్యకలాపాల సమ్మతికి కనీస వయసు 18 ఏళ్లేనని, అందులో ఎలాంటి మార్పు చేయొద్దని కేంద్రానికి నివేదించింది. 

లైంగిక కార్యకలాపాల కనీస వయసును 16 ఏళ్లకు తగ్గించాలన్న ప్రతిపాదనలను లా కమిషన్ వ్యతిరేకించింది. సమ్మతి వయసును తగ్గిస్తే బాల్య వివాహాలు, అమ్మాయిల అక్రమ రవాణా అధికమవుతాయని, ఈ అంశాలపై జరుగుతున్న ఉద్యమాలకు తీవ్ర విఘాతం కలుగుతుందని కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది. పోక్సో చట్టంలో పేర్కొన్న నిర్దిష్ట వయసును మార్చడం ఏ విధంగానూ సరికాదని కేంద్రానికి సమర్పించిన తన నివేదికలో అభిప్రాయపడింది.

More Telugu News