Pakistan: కివీస్ తో వార్మప్ మ్యాచ్... ఉప్పల్ లో పాక్ పరుగుల మోత

  • వరల్డ్ కప్ ముంగిట ప్రాక్టీస్ మ్యాచ్
  • హైదరాబాదులో పాకిస్థాన్ వర్సెస్ న్యూజిలాండ్
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్
  • మహ్మద్ రిజ్వాన్ సెంచరీ... బాబర్, సాద్ షకీల్ అర్ధసెంచరీలు
  • 50 ఓవర్లలో 5 వికెట్లకు 345 పరుగులు చేసిన పాక్
Pakistan posts huge total against New Zealand in World Cup warm up match at Uppal stadium

హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియంలో న్యూజిలాండ్ తో జరుగుతున్న వరల్డ్ కప్ వార్మప్ మ్యాచ్ లో పాకిస్థాన్ బ్యాట్స్ మెన్ రెచ్చిపోయారు. మహ్మద్ రిజ్వాన్ సెంచరీ, కెప్టెన్ బాబర్ అజామ్, సాద్ షకీల్ అర్ధసెంచరీలతో పాకిస్థాన్ భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 345 పరుగులు చేసింది. 

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పాకిస్థాన్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. 46 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయినప్పటికీ, వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ మహ్మద్ రిజ్వాన్, కెప్టెన్ బాబర్ అజామ్ జోడీ ధాటిగా ఆడడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. సెంచరీ హీరో రిజ్వాన్ 94 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 103 పరుగులు చేశాడు. బాబర్ అజామ్ 84 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 80 పరుగులు సాధించాడు. 

ఆ తర్వాత సాద్ షకీల్ మరింత దూకుడుగా ఆడడంతో పాక్ స్కోరు 300 మార్కు దాటింది. షకీల్ 53 బంతుల్లోనే 75 పరుగులు బాదాడు. అతడి స్కోరులో 5 ఫోర్లు, 4 సిక్సులు ఉన్నాయి. చివర్లో ఆఘా సల్మాన్ కూడా బ్యాట్ కు పనిచెప్పాడు. సల్మాన్ 23 బంతుల్లో 33 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఓపెనర్లు షఫీక్ (14), ఇమామ్ ఉల్ హక్ (1) విఫలమయ్యారు. 

ప్రాక్టీసు మ్యాచ్ కావడంతో న్యూజిలాండ్ జట్టులో ఎనిమిది మంది బౌలింగ్ చేశారు. మిచెల్ శాంట్నర్ 2, మాట్ హెన్రీ 1, జిమ్మీ నీషామ్ 1, లాకీ ఫెర్గుసన్ 1 వికెట్ తీశారు.

More Telugu News