World Heart Dat: ఈ ఏడు రకాల గుండె జబ్బులు అత్యంత ప్రాణాంతకం

  • సెప్టెంబరు 29న వరల్డ్ హార్ట్ డే
  • ఏటా అత్యధిక సంఖ్యలో హృద్రోగాలతో మరణాలు
  • కేవలం హార్ట్ అటాక్ తో అత్యధికుల మృత్యువాత
World Heart Day special

నేడు వరల్డ్ హార్ట్ డే. ప్రపంచవ్యాప్తంగా సంభవించే మరణాల్లో గుండె వైఫల్యం కారణంగా సంభవించేవి ఎక్కువగా ఉంటాయి. జీవనశైలి, హృద్రోగాల పట్ల ప్రజల్లో అవగాహన లేకపోవడం అందుకు కారణం. 2019లో హృద్రోగాలతో 17.9 మిలియన్ల మంది చనిపోయారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) వెల్లడించింది. ఆ ఏడాది ప్రపంచవ్యాప్తంగా నమోదైన మరణాల్లో హృద్రోగ కారక మరణాలే 32 శాతం ఉన్నాయట. అందులోనూ కేవలం హార్ట్ అటాక్ తోనే 85 శాతం మంది మృత్యువాతపడ్డారట. 

ఈ నేపథ్యంలో ప్రజల్లో గుండె సంబంధిత వ్యాధుల పట్ల అవగాహన కల్పించేందుకు గాను ప్రతి సంవత్సరం సెప్టెంబరు 29వ తేదీని వరల్డ్ హార్ట్ డేగా జరుపుకుంటారు. ఇక, హృదయ సంబంధిత వ్యాధుల్లో 7 రకాల వ్యాధులు అత్యంత ప్రాణాంతకం అని నిపుణులు చెబుతున్నారు. అవేంటో చూద్దాం.


1. కరోనరీ ఆర్టెరీ డిసీజ్ (సీఏడీ): ఇది చాలా కామన్ గా కనిపించే గుండె సంబంధ సమస్య. గుండెకు రక్తాన్ని తీసుకెళ్లే కరోనరీ ధమనులు మూసుకుపోవడాన్ని సీఏడీగా పరిగణిస్తారు. ధమనులు గట్టిపడి బిగుసుకుపోవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తుతుంది. దీన్ని వైద్య పరిభాషలో అథెరోస్క్లిరోసిస్ అంటారు. దీనివల్ల ఛాతీలో నొప్పి వస్తుంది. దీన్ని ఏంజినా అంటారు. ఇది హార్ట్ అటాక్ కు దారితీస్తుంది.
2. హార్ట్ అరిత్మియా: హృదయ స్పందనలో హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటాయి. కొన్నిసార్లు వేగంగా, కొన్నిసార్లు నిదానంగా గుండె కొట్టుకుంటుంది. గుండెలోని విద్యుత్ ప్రేరణలు సరిగా పనిచేయకపోవడం వల్ల కార్డియాక్ అరిత్మియా సంభవిస్తుంది. 
3. హార్ట్ ఫెయిల్యూర్: గుండె రక్తాన్ని సాఫీగా పంప్ చేయలేక నిలిచిపోయిన పరిస్థితి వస్తే, అది హార్ట్ ఫెయిల్యూర్ కు దారితీస్తుంది. సాధారణంగా కరోనరీ ఆర్టెరీ డిసీజ్ ఉన్నవారిలో ఇది కనిపిస్తుంది. అయితే, థైరాయిడ్, హై బీపీ, హృదయకండరాల జబ్బు (కార్డియోమయోపతి) తో బాధపడుతున్నవారిలోనూ, కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లోనూ ఇలా గుండె ఆగిపోవడం జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
4. గుండె కవాటాల జబ్బులు: గుండెలోని నాలుగు గదులు, ఊపిరితిత్తులు, రక్తనాళాల మధ్య రక్తం సరఫరా వ్యవస్థను నియంత్రించే బాధ్యత గుండెలోని కవాటాలదే. కొన్నిసార్లు కవాటాలు సరిగా పనిచేయలేని పరిస్థితి తలెత్తుతుంది. దాంతో కవాటాలు మూసుకుపోవడం కానీ, కవాటాల నుంచి రక్తం లీక్ అవడం కానీ జరుగుతుంది. పుట్టుకతోనే వచ్చే గుండె జబ్బులకు, కరోనరీ ఆర్టెరీ డిసీజ్ లకు, రుమాటిక్ జ్వరానికి, పలు ఇన్ఫెక్షన్లకు, హై బీపీకి ఈ కవాటాల్లో ఏర్పడే సమస్యలే కారణం. ఈ సమస్యలే హార్ట్ అటాక్ ముప్పును పెంచుతాయి.
5. పెరికార్డియల్ డిసీజ్: గుండె చుట్టూ ఉండే ఒక సరళమైన పొర వంటి నిర్మాణాన్ని పెరికార్డియం అంటారు. ఈ పొర దెబ్బతిన్నప్పుడు వచ్చే సమస్యలను పెరికార్డియల్ జబ్బులుగా పరిగణిస్తారు. ఈ పొరలో వాపు కనిపించడాన్ని పెరికార్డయిటిస్ గా పిలుస్తారు. ఇది చాలా ఎక్కువమందిలో కనిపించే సమస్య. వైరస్ ఇన్ఫెక్షన్లు, లూపస్, రుమటాయిడ్ ఆర్థ్రయిటిస్ వంటి వాపు సంబంధింత జబ్బులు, లేదా పెరికార్డియంకు ఏదైనా గాయం వల్ల కానీ ఈ పెరికార్టయిటిస్ సంభవిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ సమస్యకు ఓపెన్ హార్ట్ సర్జరీనే పరిష్కారం.
6. కార్డియో మయోపతి: ఇది గుండె కండరాలు, లేదా మయోకార్డియంకు సంబంధించిన అనారోగ్య పరిస్థితి. దీనివల్ల గుండె కండరాలు సాగిపోవడం కానీ, మందంగా తయారవడం కానీ, బిగుసుకుపోవడం కానీ జరుగుతుంది. కాలక్రమంలో గుండె సరిగా రక్తాన్ని పంప్ చేసే శక్తిని కోల్పోతుంది. జన్యు సంబంధ కారణాలు, కొన్ని ఔషధాల వల్ల కలిగే రియాక్షన్లు, మద్యం, వైరల్ ఇన్ఫెక్షన్లు, కొన్నిసార్లు కీమోథెరపీ కూడా కార్డియో మయోపతికి దారితీస్తుంది. దీన్ని గుర్తించడం చాలా కష్టం. 
7. కంజెన్షియల్ హార్ట్ డిసీజ్: ఇది పుట్టుకతోనే వచ్చే గుండె జబ్బు. గర్భంలో ఉన్నప్పుడే శిశువు గుండె రూపొందే సమయంలో కొన్ని లోపాల వల్ల ఈ కంజెన్షియల్ హార్ట్ డిసీజ్ తో పుడతారు. ఈ జబ్బు కొన్నిసార్లు శిశువు పుట్టిన వెంటనే బయటపడుతుంది. కొన్నిసార్లు ఆ వ్యక్తి పెరిగి పెద్దయిన తర్వాత కానీ బయటపడదు. గుండెలో రంధ్రాలు, పల్మనరీ కవాటాలు ముడుచుకుపోవడం జన్మతః సంభవిస్తాయి. 

వీటివల్ల ముప్పు ఎప్పుడు అధికంగా ఉంటుందంటే...

  • పురుషుల్లో 55 ఏళ్లు దాటాక... మహిళల్లో మెనోపాజ్ దశ దాటాక
  • శారీరక శ్రమ లేనప్పుడు
  • మధుమేహం, జీవక్రియ సంబంధిత సిండ్రోమ్ తో బాధపడుతున్నప్పుడు
  • కుటుంబంలో ఎవరికైనా కరోనరీ హార్ట్ డిసీజ్ ఉన్నట్టయితే
  • జన్యు పరమైన కారణాలు
  • హై బీపీ
  • ఎల్డీఎల్ (హై లెవెల్), హెచ్ డీఎల్ (లో లెవల్)
  • ఊబకాయం
  • ధూమపానం
  • ఒత్తిడి
ముందస్తు లక్షణాలు

  • ఛాతీలో నొప్పి
  • శ్వాస తీసుకోలేకపోవడం
  • దగ్గు, గురక రావడం
  • కాళ్లలో, మడమల వద్ద, పాదాల్లో వాపు
  • అలసట
  • గుండె దడ 


More Telugu News