Flipkart: ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ తేదీలు విడుదల.. కళ్లుచెదిరే ఆఫర్లు

  • అక్టోబర్ 8 నుంచి 15వ తేదీ వరకు బిగ్ బిలియన్ డేస్ సేల్
  • 1-3వ తేదీల మధ్య ఆఫర్ల వివరాలు.. ప్రైస్ లాక్ చేసుకునే ఆప్షన్
  • ఇంకా తేదీలు ప్రకటించని అమెజాన్.. కమింగ్ సూన్ అంటూ బోర్డ్
Flipkart Big Billion Days sale to go live from October 8

షాపింగ్ ప్రియులు ఏడాది పాటు వేచి చూసే పండుగ రానే వచ్చింది. ఏటా దసరాకు ముందు ఈ కామర్స్ సంస్థలు ఫ్లిప్ కార్ట్, అమెజాన్ మెగా ఫెస్టివల్ సేల్స్ నిర్వహిస్తుంటాయి. ఫ్లిప్ కార్ట్ అయితే బిగ్ బిలియన్ డేస్, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ పేరుతో భారీ ఆఫర్లు, తగ్గింపులతో విక్రయాలు నిర్వహిస్తుంటాయి. ఏడాది మొత్తం వ్యాపారంలో 30 శాతం వరకు ఈ సేల్ లోనే నమోదవుతుంటుంది. కనుక ఫ్లిప్ కార్ట్, అమెజాన్ ఈ సేల్స్ ను చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంటాయి. ఎప్పుడూ చూడని ఆఫర్లు వస్తాయి కనుక వినియోగదారులు కూడా ఈ సమయంలోనే ఎక్కువగా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. 

ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ అమ్మకాలు అక్టోబర్ 8న మొదలై, అక్టోబర్ 15తో ముగుస్తాయి. ఈ తేదీల వివరాలను గురువారం విడుదల చేసింది. ఫ్లిప్ కార్ట్ లో కొనుగోళ్లపై డిస్కౌంట్ కు తోడు, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ క్రెడిట్ కార్డు దారులకు 10 శాతం అదనపు డిస్కౌంట్ లభించనుంది. స్మార్ట్ ఫోన్ల నుంచి ఇతర ఎలక్ట్రానిక్, గృహోపకరణాలు, ఫర్నిచర్, కిచెన్ తదితర ఉత్పత్తులపై 40-60 శాతం వరకు డిస్కౌంట్ ఇవ్వనున్నట్టు ఫ్లిప్ కార్ట్ పేర్కొంది. బిగ్ బిలియన్ డేస్ సేల్ కొన్ని రోజుల ముందు డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించనున్నట్టు ఫ్లిప్ కార్ట్ తెలిపింది. అక్టోబర్ 1-3వ తేదీల మధ్య యూజర్లు తాము కొనుగోలు చేయాలనుకున్న దాన్ని డిస్కౌంట్ ధరకు లాక్ చేసుకోవచ్చు. సేల్ లో అదే ధరకు కొనుగోలు చేసుకోవచ్చు.

అమెజాన్ అక్టోబర్ 10 నుంచి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు ప్రకటించగా, ఫ్లిప్ కార్ట్ సేల్ రెండు రోజులు ముందు మొదలు కానుండడంతో పునరాలోచనలో పడింది. అమెజాన్ సైతం అక్టోబర్ 8 నుంచే సేల్ ను ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. అమెజాన్ అయితే ఉత్పత్తుల వారీగా డిస్కౌంట్ ఆఫర్లకు తోడు, ఎస్ బీఐ క్రెడిట్, డెబిట్ కార్డులపై 10 శాతం అదనపు డిస్కౌంట్ ఇవ్వనుంది.

More Telugu News