Masoor Dal: భారత్-కెనడా మధ్య దెబ్బతిన్న సంబంధాలు.. పెరగనున్న పప్పుల ధరలు

  • కెనడా నుంచి ప్రొటీన్లు అధికంగా ఉండే ఎర్రపప్పు దిగుమతి
  • ఉద్రిక్తతల నేపథ్యంలో దిగమతి ఆగిపోయే ప్రమాదం
  • అదే జరిగితే పప్పుల కొరత ఏర్పడి ధరలు  పెరుగుతాయంటున్న వ్యాపార వర్గాలు
  • అలాంటిదేమీ ఉండబోదంటున్న ప్రభుత్వం
Masoor Dal Price May Hike As India Canada Conflict

భారత్-కెనడా మధ్య దెబ్బతిన్న దౌత్యసంబంధాలు ఇప్పుడు సామాన్యులపైనా ప్రభావం చూపేలా ఉన్నాయి. ముఖ్యంగా పప్పుల ధరలు పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న కారణంగా ఎగుమతి, దిగుమతులపై నిషేధం విధిస్తే కెనడా నుంచి భారత్‌కు దిగుమతి అయ్యే ఎర్రపప్పు ఆగిపోయే ప్రమాదం ఉందని ఓలం అగ్రి ఇండియా సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నితిన్ గుప్తా తెలిపారు. అయితే, ప్రస్తుతం ఇరు దేశాల మధ్య నెలకొన్న వివాద ప్రభావం వ్యాపార సంబంధాలపై పడే అవకాశం లేదని ప్రభుత్వం చెబుతోంది.

ప్రొటీన్లు పుష్కలంగా ఉండే ఎర్రపప్పు కెనడా నుంచి భారత్ భారీగా దిగుమతి చేసుకుంటుంది. మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో భారత్ రూ. 3,079 కోట్ల విలువైన 4,85,495 టన్నుల ఎర్రపప్పును దిగుమతి చేసుకుంది. భారత్ దిగుమతి చేసుకునే మొత్తం ఎర్రపప్పు దిగుమతుల్లో ఇది సగం కంటే ఎక్కువ. గతేడాది ఏప్రిల్ నుంచి జులై వరకు 1,90,784 టన్నుల ఎర్రపప్పు దిగుమతి కాగా, ఈ ఏడాది అదే సమయంలో 420 శాతం అధికంగా దిగుమతి అయినట్టు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.

మన దేశంలో ఏడాదికి 24 లక్షల టన్నుల ఎర్రపప్పు వినియోగిస్తుండగా, దేశంలో 16 లక్షల టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతోంది. ఈ ఏడాది ఏప్రిల్-జూన్ మధ్య కెనడా నుంచి 95 వేల టన్నుల పప్పు దిగుమతి అయింది. అదే సమయంలో ఆస్ట్రేలియా నుంచి 1.99 లక్షల టన్నుల పప్పును భారత్ దిగుమతి చేసుకుంది. ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్-కెనడా మధ్య ఎగుమతి, దిగుమతులపై నిషేధం విధిస్తే దేశంలో పప్పుల కొరత ఏర్పడి ధరలు పెరిగే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.

More Telugu News