Esha Singh: ఆసియా క్రీడల్లో తెలంగాణ బిడ్డ ఈషా సింగ్ కు స్వర్ణం... సీఎం కేసీఆర్ స్పందన

  • చైనాలోని హాంగ్ ఝౌ నగరంలో కొనసాగుతున్న ఆసియా క్రీడలు
  • మహిళల షూటింగ్ 25 మీటర్ల పిస్టల్ అంశంలో భారత్ కు స్వర్ణం
  • స్వర్ణం సాధించిన జట్టులో ఈషా సింగ్ సభ్యురాలు
  • హర్షం వ్యక్తం చేసిన తెలంగాణ సీఎం కేసీఆర్
CM KCR express joy after Esha Singh wins gold for India in 25m pistol shooting team event

చైనాలోని హాంగ్ ఝౌ నగరంలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ పతకాల జోరు కొనసాగుతోంది. భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. ఈషా సింగ్, మను బాకర్, రిథిమ్ సంగ్వాన్ లతో కూడిన భారత మహిళల జట్టు షూటింగ్ లో పసిడి ప్రదర్శన కనబరిచింది. మహిళల 25 మీటర్ల పిస్టల్ టీమ్ ఈవెంట్ లో భారత మహిళల జట్టు ప్రథమ స్థానంలో నిలిచింది. 

ఈ జట్టులో తెలంగాణ అమ్మాయి ఈషా సింగ్ కూడా సభ్యురాలు కావడంతో బీఆర్ఎస్ ప్రభుత్వం హర్షం వ్యక్తం చేసింది. దీనిపై తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందించారు. తెలంగాణ బిడ్డ ఈషా సింగ్ టీమ్ స్వర్ణం సాధించిందంటూ సంతోషం వెలిబుచ్చారు. ఆసియా క్రీడల షూటింగ్ ఈవెంట్లో ఈషా సింగ్ టీమ్ 1759 పాయింట్లతో స్వర్ణం చేజిక్కించుకుందని వెల్లడించారు. 

తెలంగాణ ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి అమలు చేస్తున్న పటిష్ఠ కార్యాచరణే జాతీయ, అంతర్జాతీయ వేదికల్లో తెలంగాణ క్రీడాకారులు కనబరుస్తున్న ప్రతిభకు నిదర్శనమని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ క్రీడాకారులు రానున్న రోజుల్లో మరెన్నో పతకాలు సాధించడం ద్వారా తెలంగాణ ఖ్యాతిని జగద్విదితం చేయాలని ఆకాంక్షించారు.

More Telugu News