heart attack: హార్ట్ ఎటాక్ ను ముందే గుర్తించొచ్చా..?

  • సులభ పరీక్షలతో హార్ట్ ఎటాక్ ను గుర్తించొచ్చు
  • ముందే తెలుసుకుంటే ముప్పును నివారించొచ్చు
  • ఛాతీలో నొప్పి, అలసట, చెమటలు పడితే ఆలస్యం చేయొద్దు
World Heart Day Can heart attack be detected by a blood test

హార్ట్ ఎటాక్.. ఆలస్యం చేస్తే నిమిషాల్లోనే ప్రాణాలను తీసేస్తుంది. చాలా వేగంగా స్పందించినట్టయితే ప్రాణాలను కాపాడుకునే అవకాశాలు ఉంటాయి. ధమనుల్లో కొవ్వు పేరుకుపోయినప్పుడు అది బ్లాకేజ్ కు దారితీస్తుంది. అలాగే, రక్త నాళాల గోడలపై పేరుకున్న కొవ్వు ఫలకాలు పగిలి విచ్ఛిన్నమైనప్పుడు రక్తం గడ్డకట్టి హార్ట్ ఎటాక్ కు దారితీస్తుంది. దీంతో రక్తం, ఆక్సిజన్ గుండెకు చేరుకోలేవు. ఫలితంగా గుండె కండరాలకు నష్టం ఏర్పడుతుంది. దీంతో ప్రాణ ప్రమాదం ఏర్పడుతుంది. కుటుంబంలో గుండె జబ్బుల చరిత్ర ఉన్న వారికి ఈ రిస్క్ ఎక్కువ. అలాగే, అనారోగ్యకర జీవనశైలి, రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ ఉన్న వారికి కూడా హార్ట్ ఎటాక్ రిస్క్ ఉంటుంది.

లక్షణాలు
హార్ట్ ఎటాక్ లక్షణాలు తెలుసుకోవడం వల్ల ఆరంభంలోనే గుర్తించి జాగ్రత్త పడేందుకు అవకాశం ఉంటుంది. ఛాతీలో నొప్పి, ఛాతీలో పట్టేసినట్టు ఉండడం, ఎంతో బరువు మోపినట్టు అనిపించడం, అలసట, చెమటలు పట్టడం, గుండెలో మంటగా అనిపించడం, తల తిరగడం, శ్వాస సరిగ్గా ఆడకపోవడం వంటి లక్షణాలు హార్ట్ ఎటాక్ లో ఉంటాయి. కొందరిలో ఛాతీ వెనుక భాగంలో నొప్పి, అరగకపోవడం, అలసట, దవడ నొప్పి కూడా కనిపిస్తాయి. ఇలాంటి లక్షణాల్లో ఏవి కనిపించినా నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల వద్దకు వెళ్లాలి. వారు కొన్ని పరీక్షల ద్వారా నిర్ధారిస్తారు.

పరీక్షలు
హాస్పిటల్ కు వెళ్లిన వెంటనే ఈసీజీ తీస్తారు. గుండెలో ఎలక్ట్రికల్ సిగ్నల్స్ సక్రమంగానే ఉన్నాయా? లేక ఏదైనా తేడా ఉందా? అన్నది దీని ద్వారా తెలుస్తుంది. హార్ట్ ఎటాక్ రిస్క్ చాలా సందర్భాల్లో  ఈసీజీ ద్వారా తెలుస్తుంది. అలాగే, ఛాతీ ఎక్స్ రే ద్వారా కూడా హార్ట్ ఎటాక్ ను గుర్తించొచ్చు. థ్రెడ్ మిల్ టెస్ట్ కూడా చేయిస్తారు. హార్ట్ ఎటాక్ వచ్చినప్పుడు దెబ్బతిన్న గుండె కణజాలం నుంచి మజిల్ ప్రొటీన్లు విడుదల అవుతాయి. మయో గ్లోబిన్, ట్రోపోనిన్ ఐ, ట్రోపోనిన్ ఆర్ ప్రొటీన్లు విడుదల అయినదీ రక్త పరీక్ష సాయంతో గుర్తించొచ్చు. మయోకార్డియల్ ఇన్ ఫార్షన్ ఏ స్థాయిలో ఉందో తెలుసుకునేందుకు ట్రోపోనిన్ అస్సే టెస్ట్ చేయిస్తారు. హార్ట్ ఎటాక్ వచ్చిన 6-12 గంటల వరకు ఈ ప్రొటీన్లు సాధారణంగా రక్తంలో పెరుగుతాయి. 48 గంటల తర్వాత సాధారణ స్థితికి వస్తాయి. దీని సాయంతో హార్ట్ ఎటాక్ వచ్చిందీ? లేనిదీ గుర్తించి తదుపరి చికిత్సను నిర్ణయిస్తారు.  మరీ ముఖ్యంగా టీఎంటీ టెస్ట్ ద్వారా వచ్చే ఏడాది కాలంలో హార్ట్ ఎటాక్ రిస్క్ వస్తుందేమో వైద్యులు గుర్తిస్తారు. అలాగే 2డీ ఎకో పరీక్ష కూడా గుండె పనితీరును తెలియజేస్తుంది.

More Telugu News