Maharashtra: పోలీసు చేతిలో చెంపదెబ్బతో వ్యక్తి మృతి

  • మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో వెలుగు చూసిన ఘటన
  • కారు పార్క్ చేసే సమయంలో ఎస్‌ఆర్‌పీఎఫ్ పోలీసుతో పొరుగింటి వ్యక్తికి వాగ్వాదం
  • విచక్షణ కోల్పోయిన పోలీసు అతడి చెంప ఛెళ్లుమనిపించిన వైనం
  • ఆ దెబ్బకు అక్కడికక్కడే కూలిపోయిన వ్యక్తి
  • రెండు రోజుల తరువాత ఆసుపత్రిలో మృతి
Man dies as SRPF jawan slaps him during argument over cars headlight in Nagpur

మహారాష్ట్రలోని నాగ్‌పూర్ నగరంలో తాజాగా షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌కు చెందిన ఓ పోలీసు 54 ఏళ్ల వ్యక్తి చెంపపై గట్టిగా కొట్టడంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రెండు రోజుల తరువాత మృతి చెందారు. వథోడా పోలిస్ స్టేషన్ పరిధిలోని మాతా మందిర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గురువారం రాత్రి ఎస్‌ఆర్‌పీఎఫ్‌కు చెందిన నిఖిల్ గుప్తా(30) తన చెల్లెల్ని చూసేందుకు నగరానికి వచ్చారు. ఆమె ఇంటి ముందు కారు పార్క్‌ చేస్తుండగా హెడ్‌లైట్ హైబీమ్‌లో ఉండటంతో వెలుతురు స్థానికుడు మురణీధర్ రామరావ్‌జీ నవారేను ఇబ్బంది పెట్టింది. దీంతో లైటు లోబీమ్‌లో పెట్టి కారు పార్కు చేయాలని ఆయన సూచించారు. 

దీంతో, ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. ఈ క్రమంలో విచక్షణ కోల్పోయిన నిఖిల్.. నవారే చెంపపై గట్టిగా కొట్టడంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. కుటుంబసభ్యులు ఆయనను ఆసుపత్రిలో చేర్పించగా శనివారం మృతి చెందారు. దీంతో, పోలీసులు నిఖిల్‌పై సెక్షన్ 304 కింద కేసు నమోదు చేశారు.

More Telugu News