Sudhamurthy: పోలీసులను ఆశ్రయించిన ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి భార్య సుధామూర్తి

Sudhamurthy approaches police saying her name is being misused to collect money
  • తన పేరును దుర్వినియోగపరుస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు
  • తాను హాజరుకాని కార్యక్రమాల్లో తన పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నట్టు ఆరోపణ
  • సుధామూర్తి తరుపున ఆమె అసిస్టెంట్ పోలీసులకు ఫిర్యాదు అందజేత
ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడు నారాయణ మూర్తి భార్య, రచయిత్రి సుధామూర్తి తాజాగా పోలీసులను ఆశ్రయించారు. తన పేరు దుర్వినియోగ పరుస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు. తనకు సంబంధం లేని కార్యక్రమాల్లో తన పేరును ప్రస్తావిస్తూ కొందరు డబ్బు వసూళ్లకు దిగుతున్నారని ఆరోపించారు. ఈ మేరకు సుధామూర్తి తన ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్‌తో పోలీసులకు ఫిర్యాదు అందజేశారు.

తమ సంస్థ 50వ వార్షికోత్సవానికి హాజరుకావాలంటూ కన్నడకూట నార్తన్ కాలిఫోర్నియా (కేకేఎన్‌సీ) వారు గతంలో సుధామూర్తిని ఆహ్వానించారు. తీరిక లేకుండా ఉన్న కారణంగా తాను రాలేనని ఆమె చెప్పారు. కానీ, ఆ కార్యక్రమంలో తాను ముఖ్య అతిథిగా పాల్గొంటున్నట్టు జరుగుతున్న ప్రచారం గురించి సుధామూర్తి దృష్టికి వచ్చింది. అయితే, లావణ్య అనే మహిళ సుధామూర్తి వ్యక్తిగత కార్యదర్శినని చెప్పి తమను మోసం చేసినట్టు కేకేఎన్‌సీ వారు పేర్కొన్నారు. 

మరో ఉదంతంలోనూ సుధామూర్తి పేరును ఓ మహిళ దుర్వినియోగపరిచింది. అమెరికాలో జరిగే ఓ కార్యక్రమానికి ఆమె హాజరవుతారంటూ ప్రచారం చేసింది. కార్యక్రమానికి హాజరయ్యేందుకు సిద్ధమైన వారి నుంచి 40 డాలర్ల చొప్పున వసూలు చేసింది. ఇక సుధామూర్తి ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆమె పేరు చెప్పి మోసాలకు దిగిన మహిళలు ఇండియాలో ఉన్నారా? లేక అమెరికాలో ఉన్నారా? అనే విషయాన్ని ఆరా తీస్తున్నారు.
Sudhamurthy
Infosys

More Telugu News