అన్నదమ్ముల్లా కలిసి పోరాడుదాం: జనసేన నాయకులతో నారా బ్రాహ్మణి

Nara Brahmani to Janasena leaders
  • చంద్రబాబు తప్పు చేసినట్లు చిన్న ఆధారం కూడా లేదన్న బ్రాహ్మణి
  • ఈ స్థాయి విద్వేష రాజకీయాలు ఎప్పుడూ లేవని ఆవేదన
  • చంద్రబాబు అరెస్ట్ కక్ష సాధింపు చర్యే అన్న జనసేన నేతలు
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో ఆయన కోడలు, నారా లోకేశ్ సతీమణి నారా బ్రాహ్మణిని తూర్పు గోదావరి జిల్లా జనసేన నాయకులు కలిసి సంఘీభావం తెలిపారు. వీరు రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ఈ సందర్భంగా బ్రాహ్మణి మాట్లాడుతూ... రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు ఎవరూ, ఎప్పుడూ చూడలేదన్నారు. చంద్రబాబుపై కేసు విషయంలో అన్ని డాక్యుమెంట్లు, రిపోర్టులు తాను పరిశీలించానని, చంద్రబాబు తప్పు చేసినట్లు చిన్న ఆధారం కూడా ఎక్కడా లేదన్నారు. రాజకీయ కక్ష తప్ప ఈ కేసు మరొకటి కాదన్నారు.

ఈ స్థాయి విద్వేష రాజకీయాలు ఎప్పుడూ లేవని బ్రాహ్మణి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు లేవని... గంజాయి, డ్రగ్స్ మాత్రమే ఉన్నాయన్నారు. తెలుగుదేశం, జనసేన.. రెండు పార్టీల నుంచి సమన్వయ కమిటీ ఏర్పాటుపై లోకేశ్ చర్చిస్తున్నారని తనను కలిసిన జనసేన నేతలకు తెలిపారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు రెండు పార్టీలు అన్నదమ్ముల్లా కలిసి పోరాడాలన్నారు. స్వయంగా వచ్చి సంఘీభావం తెలిపిన జనసేన నేతలకు, అండగా నిలబడుతున్న పార్టీ కార్యకర్తలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.

చంద్రబాబు అరెస్ట్ ముమ్మాటికి రాజకీయ కక్ష సాధింపు చర్యే అని జనసేన నేతలు ఆమెతో అన్నారు. రాష్ట్రంలో పరిస్థితులు రోజురోజుకూ దిగజారుతున్నాయన్నారు. రాక్షస పాలనపై ఉమ్మడి పోరాటం చేయాలన్నారు. చంద్రబాబు అరెస్ట్‌‌ను నిరసిస్తూ ఉమ్మడిగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. కాగా, తూర్పు గోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు కందుల దుర్గేశ్ నేతృత్వంలో పలువురు ఇంఛార్జ్‌లు, నేతలు బ్రాహ్మణిని కలిసి మద్దతు ప్రకటించారు. మద్దతు తెలిపిన వారిలో ముత్తా శశిధర్, తోట సుధీర్,తుమ్మల రామస్వామి బాబు, పితాని బాలకృష్ణ, తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్, పోలిశెట్టి చంద్రశేఖర్, గంటా స్వరూపారాణీ, బత్తుల బలరామకృష్ణ, వాసిరెడ్డి శివ, మర్రెడ్డి శ్రీనివాస్, వరుపుల తమ్మయ్య బాబు తదితరులు ఉన్నారు.
Go Back to Shorts
Chandrababu
nara brahmani
Janasena
Andhra Pradesh

More Telugu News