odi world cup: పాకిస్థాన్​ క్రికెటర్లకు వీసా కష్టాలు.. రెండు రోజులు ఆలస్యంగా హైదరాబాద్​ రానున్న జట్టు!

Visa issue delays Pakistan team arrival in India and limited visas for Pakistani fans
  • ప్రపంచ కప్‌ కోసం పాక్‌ జట్టుకు ఇంకా అందని భారత వీసాలు
  • ఈ నెల 25కు బదులు 27న హైదరాబాద్‌ చేరుకోనున్న పాక్‌
  • 29న ఉప్పల్‌లో న్యూజిలాండ్‌తో వామప్ మ్యాచ్‌

వన్డే ప్రపంచ కప్ కోసం భారత్ రావాల్సిన పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు వీసా కష్టాలు ఎదురయ్యాయి. ఆ జట్టు ఆటగాళ్లు, అధికారులకు ఇంకా భారత వీసాలు లభించలేదు. షెడ్యూల్‌ ప్రకారం పాక్‌ జట్టు ఈ నెల 25న హైదరాబాద్‌కు చేరుకోవాల్సి ఉంది. అంతకుముందు ఆటగాళ్లంతా దుబాయ్ చేరుకొని రెండు రోజులు ప్రాక్టీస్ లో పాల్గొనాల్సి ఉంది. దుబాయ్‌ నుంచి నేరుగా హైదరాబాద్‌కు రావాలని ముందుగా ప్రణాళిక వేసుకున్నారు. ఈ మేరకు భారత వీసాల కోసం ఇస్లామాబాద్‌లోని భారత ఎంబసీకి పాక్ జట్టు ప్రతినిధులు చేరుకున్నారు. కానీ, వీసా ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని అక్కడి అధికారులు చెప్పడంతో షాకయ్యారు. 

దీంతో బలవంతంగా దుబాయ్‌ పర్యటనను రద్దు చేసుకున్నామని పాక్ క్రికెట్ బోర్డు వర్గాలు తెలిపాయి. దుబాయ్ వెళ్లకుండా ఈ నెల 27న నేరుగా హైదరాబాద్‌ బయలుదేరతామని పేర్కొన్నాయి. ప్రపంచ కప్ సన్నాహకాల్లో భాగంగా పాకిస్థాన్ ఈ నెల 29న హైదరాబాద్‌ వేదికగా న్యూజిలాండ్‌తో వామప్‌ మ్యాచ్‌ ఆడనుంది. మరోవైపు ప్రపంచ కప్ కోసం పాకిస్థాన్‌ నుంచి భారత్‌కు వచ్చే అభిమానులు, జర్నలిస్టులకు పరిమిత సంఖ్యలో వీసాలు ఇవ్వాలని భారత ప్రభుత్వం భావిస్తోందని తెలుస్తోంది. 2016 టీ20 ప్రపంచ కప్‌ సందర్భంగా ఒక్కో మ్యాచ్‌కు 250 వీసాలు మాత్రమే లభించాయి.

  • Loading...

More Telugu News