Kamal Haasan: సనాతన ధర్మంపై ఉదయనిధి కంటే ముందే పలువురు మాట్లాడారు: కమలహాసన్

  • ఇటీవల సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు
  • ఇప్పటికీ తగ్గని దుమారం
  • ఉదయనిధి చిన్నపిల్లవాడన్న కమల్
  • ఉదయనిధి కంటే ముందే పలువురు సనాతన ధర్మం గురించి మాట్లాడారని వెల్లడి
Kamal Haasan opines on Udayanidhi Stalin comments about Sanatana Dharma

తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కుమారుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ చర్చనీయాంశంగానే ఉన్నాయి. సనాతన ధర్మం కరోనా, మలేరియా, డెంగీ వంటి మహమ్మారి అని, దాన్ని నిర్మూలించకపోతే ప్రమాదం అని వ్యాఖ్యానించారు.

ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై తాజాగా ప్రముఖ నటుడు, మక్కళ్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ స్పందించారు. సనాతన ధర్మంపై ఉదయనిధి కంటే ముందు కూడా కొందరు వ్యాఖ్యలు చేశారని, కానీ, చిన్నవాడైన ఉదయనిధిని వెంటాడుతున్నారని కమల్ విచారం వ్యక్తం చేశారు. 

అసలు, సనాతన అనే పేరు పెరియార్ ద్వారా వచ్చిందని, సనాతన ధర్మం గురించి అందరికీ తెలిసిందంటే అది పెరియార్ వల్లనే అని పేర్కొన్నారు. పెరియార్ వారణాసిలో నుదుటన తిలకం దిద్దుకుని ఓ ఆలయంలో పూజలు చేస్తుండేవాడని, కానీ అవన్నీ విడిచిపెట్టి ఆయన ప్రజాసేవకు అంకితం అయ్యారంటే ఆయనకు పరిస్థితులు ఎంత కోపం తెప్పించి ఉంటాయో ఆలోచించుకోవాలని సూచించారు. 

పెరియార్ తన జీవితమంతా ప్రజల కోసమే గడిపారని కమల్ వెల్లడించారు. పెరియార్ ను ఏ పార్టీ కూడా తమ వాడు అని చెప్పుకోదని, ఆయన అందరివాడు, తమిళనాడుకు ఆస్తి వంటివాడు అని వివరించారు. 

తమిళనాడుకు చెందిన పెరియార్ దేశంలో గొప్ప సామాజిక సంఘ సంస్కర్తగా పేరుగాంచారు. ఆత్మగౌరవమే ప్రధాన అజెండాగా ఉద్భవించిన ద్రావిడ ఉద్యమానికి పెరియార్ ఆద్యుడు అని చెబుతారు. ఆయన అసలు పేరు ఈరోడ్ వెంకటప్ప రామసామి. 1879లో ఈరోడ్ లో జన్మించిన ఆయన 1973లో కన్నుమూశారు.

More Telugu News