Moto GP: జమ్మూ కశ్మీర్ లేకుండా భారత్ మ్యాప్... క్షమాపణలు చెప్పిన మోటో జీపీ

  • భారత్ లో మోటో గ్రాండ్ ప్రిక్స్ ఈవెంట్
  • సెప్టెంబరు 21 నుంచి 24 వరకు రేసింగ్
  • భారత్ లో తొలిసారిగా మోటో జీపీ బైక్ రేసింగ్
Moto GP apologises Indian fans after it telecasted India map without Jammu Kashmir and Ladakh

భారత్ లో తొలిసారి అంతర్జాతీయ బైక్ రేసింగ్ (మోటో జీపీ) జరుగుతున్న నేపథ్యంలో తీవ్ర వివాదం చోటుచేసుకుంది. మోటో జీపీ లైవ్ స్ట్రీమింగ్ సందర్భంగా నిర్వాహకులు భారతదేశ మ్యాప్ ను ప్రదర్శించారు. అందులో జమ్మూ కశ్మీర్, లడఖ్ లేకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ చర్య భారత వర్గాలను ఆగ్రహానికి గురిచేసింది. 

సోషల్ మీడియాలో యూజర్లు మోటో జీపీ పేర్కొన్న మ్యాప్ ను తప్పుబట్టారు. సర్వత్రా దీనిపై విమర్శలు వస్తుండడంతో మోటో జీపీ యాజమాన్యం వెంటనే స్పందించింది. భారత్ లోని అభిమానులకు క్షమాపణలు చెబుతున్నామని ఓ ప్రకటన విడుదల చేసింది. తమ పోటీలకు ఆతిథ్యమిస్తున్న దేశాన్ని కించపర్చాలన్న ఉద్దేశం తమకు ఎంత మాత్రం లేదని స్పష్టం చేసింది. ఆతిథ్య దేశానికి మద్దతు, అభినందనలు లభించాలనే తాము కోరుకుంటామని మోటో జీపీ పేర్కొంది. 

కాగా, మోటో గ్రాండ్ ప్రిక్స్ బైక్ రేసింగ్ ఈవెంట్ లో భాగంగా సెప్టెంబరు 21న రేసింగ్ పోడ్ కాస్ట్ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. సెప్టెంబరు 22, 23 తేదీల్లో ప్రాక్టీస్ రేసులు, సెప్టెంబరు 24న మెయిన్ రేసు జరగనున్నాయి. అగ్రశ్రేణి రేసర్లు, టీమ్ లు పాల్గొంటున్న ఈ పోటీలకు గ్రేటర్  నోయిడాలోని బుద్ధ ఇంటర్నేషనల్ రేసింగ్ సర్క్యూట్ వేదికగా నిలుస్తోంది.

More Telugu News