Rahul Gandhi: ప్రజాస్వామ్యంపై భారత్‌లో జరుగుతున్న దాడిపై చాలామంది పోరాడుతున్నారు.. నార్వేలో రాహుల్‌గాంధీ

  • ఈ నెల మొదట్లో నార్వేలోని ఓస్లో విశ్వవిద్యాలయంలో రాహుల్ వ్యాఖ్యలు
  • తాజాగా వీడియో విడుదల చేసిన కాంగ్రెస్
  • దేశంలో ఎక్కువ మందిని మాట్లాడనీయడం లేదని ఆవేదన
  • ప్రతిపక్ష కూటమి తన పేరును మార్చుకుంటే అప్పుడు మళ్లీ దేశం పేరును మోదీ మారుస్తారని ఎద్దేవా
If we change our name Then Modi will have to change the name again Says Rahul Gandhi

నరేంద్రమోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత భారత్‌లోని ప్రజాస్వామ్యానికి సంబంధించి ప్రతి ఒక్కటీ మార్పునకు గురయ్యాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రజాస్వామ్యం ఇప్పుడు బలహీన పడుతోందని, జనాభాలో ఎక్కువమందిని మాట్లాడడానికి అనుమతించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యం తీవ్ర దాడికి గురవుతున్నప్పటికీ దేశం దానిని రక్షించుకుంటోందని అన్నారు. ఆ రక్షణ కనుక ఆగిపోయినప్పుడు భారత్ ఇక ప్రజాస్వామ్య దేశం కాదని తాను చెబుతానని పేర్కొన్నారు. 

మన ప్రజాస్వామ్య నిర్మాణంపై జరుగుతున్న దాడికి వ్యతిరేకంగా ఇప్పటికీ చాలామంది పోరాడుతున్నారని, అదింకా ముగియలేదని, తాము గెలుస్తామని భావిస్తున్నట్టు రాహుల్ చెప్పుకొచ్చారు. ఈ నెల మొదట్లో నార్వేలోని ఓస్లో విశ్వవిద్యాలయంలో రాహుల్ చేసిన ఈ వ్యాఖ్యల వీడియోను కాంగ్రెస్ పార్టీ నిన్న విడుదల చేసింది. 

ఇండియా పేరును భారత్‌గా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న వార్తలపైనా రాహుల్ స్పందించారు. ఇండియా పేరు భారత్‌గా మారిందని విపక్ష ఇండియా కూటమి కూడా పేరు మార్చుకుంటే, అప్పుడు ప్రధాని మరోమారు దేశం పేరును మారుస్తారని ఎద్దేవా చేశారు.

ఏదైనా రాజకీయ పార్టీ కేవలం పేరును ఎంచుకోవడం వల్ల అధికారంలో ఉన్నవారు దేశం పేరు మార్చి విజయం సాధిస్తారనుకుంటే తాను నమ్మనని, అదో ప్రపంచ రికార్డు అవుతుందని సభికుల నవ్వుల మధ్య రాహుల్ వ్యాఖ్యానించారు. భారత ప్రజాస్వామ్యాన్ని హత్యచేయడాన్ని ఇండియా కూటమిలోని ఏ ఒక్కరు సహించబోరని రాహుల్ స్పష్టం చేశారు.

More Telugu News