DK Aruna: ఆరు గ్యారెంటీలు కాదు... కాంగ్రెస్ ఈ మూడు గ్యారెంటీలు ఇవ్వాలి: డీకే అరుణ

  • కర్ణాటకలో రూ.4వేల పెన్షన్ ఇస్తున్నారా? అని ప్రశ్న
  • కాంగ్రెస్ నుంచి గెలిస్తే ఎమ్మెల్యేలు పార్టీ మారరని గ్యారెంటీ ఇవ్వాలన్న మాజీ మంత్రి
  • కుంభకోణాలు చేయమని, తెలంగాణ చరిత్రను తప్పుదారి పట్టించబోమనే గ్యారెంటీ ఇవ్వాలన్న డీకే అరుణ
DK Aruna questions congress over 6 Guarantees

ఆరు గ్యారెంటీల పేరుతో తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసే ప్రయత్నాలు చేస్తోందని, కానీ ఇతర రాష్ట్రాలలో అధికారంలోకి రావడానికి ఇచ్చిన హామీలను నెరవేర్చారా? అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ప్రశ్నించారు. కర్ణాటకలో రూ.4వేల పెన్షన్ ఇస్తున్నారా? కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇప్పుడు తెలంగాణకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నారా? అని నిలదీశారు. కర్ణాటకలో ఆర్టీసీ పరిస్థితి అధ్వానంగా తయారైందన్నారు. అందుకే ఆర్టీసీని ప్రయివేటుపరం చేయాలని కర్ణాటక ప్రభుత్వం చూస్తోందన్నారు.

కాంగ్రెస్ పార్టీ ముందు మూడు గ్యారెంటీలు ఇవ్వాలని ప్రశ్నించారు. ఒకటి గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీ మారరని, రెండు కుంభకోణాలు చేయబోమని, మూడు తెలంగాణ చరిత్రను తప్పుదారి పట్టించబోమనే మూడు గ్యారెంటీలు ఇవ్వాలని నిలదీశారు. ప్రపంచ దేశాల్లో భారత్‌ను అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రధాని మోదీ కృషి చేస్తున్నారన్నారు. కానీ కాంగ్రెస్, మిత్రపక్షాలు విద్వేషాలను రెచ్చగొడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ విశ్వాసం కోల్పోయిందన్నారు.

కేసీఆర్ పైనా డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలను గౌరవించే అలవాటు ముఖ్యమంత్రికి లేదన్నారు. బీఆర్ఎస్ కమిటీలలో ఎక్కడైనా మహిళలకు కీలక బాధ్యతలు ఇచ్చారా? అని ప్రశ్నించారు. పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టులో తన శ్రమ ఉందని, ఆ ప్రాజెక్టు కోసం తనను గౌరవించకుండా ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ తోడుదొంగలు అన్నారు. వీరు ముగ్గురు ఒకటై బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు.

More Telugu News