Nagarkurnool District: ఏడు నెలల పసికందుతో సహా నలుగురు పిల్లలను కాలువలో విసిరేసిన కన్నతల్లి..!

  • మూడు మ‌ృతదేహాలను వెలికి తీసిన పోలీసులు
  • ఇంకా దొరకని పసికందు డెడ్ బాడీ
  • భర్త మందలించడంతో ఓ కన్నతల్లి దుర్మార్గం
  • నాగర్ కర్నూల్ జిల్లాలో దారుణం
Mother Threw her four Kids Into canal

కల్లుకు బానిసై పిల్లలను పట్టించుకోవడంలేదని భర్త మందలించడంతో ఓ మహిళ దారుణానికి పాల్పడింది. అభంశుభం ఎరగని పసికందుతో సహా కడుపున పుట్టిన నలుగురు పిల్లలనూ కాలువలో విసిరేసింది. అమ్మా అమ్మా వద్దమ్మా అంటూ ఏడుస్తున్నా నిర్దయగా వ్యవహరించింది. ఏడు నెలల పసికందును కూడా కాలువలో పడేసింది. దీంతో పిల్లలు నలుగురూ కన్నుమూశారు. నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండల కేంద్రంలో శనివారం చోటుచేసుకుందీ విషాదం. ముగ్గురు చిన్నారుల మృతదేహాలను వెలికితీసిన పోలీసులు పసికందు కోసం గజ ఈతగాళ్ల సాయంతో గాలిస్తున్నారు. పిల్లల మృతదేహాలను వెలికి తీస్తుంటే గ్రామస్థులు కంటతడి పెట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిజినేపల్లి మండలం మంగనూర్ గ్రామానికి చెందిన మానుపాడు శరమంద, లలిత దంపతులకు మహాలక్ష్మి (7), సాత్విక(5), మంజుల(3) లతో పాటు మార్కండేయ (7 నెలలు) ఉన్నారు. కొంతకాలంగా కల్లు తాగడానికి బానిసగా మారిన లలిత.. పిల్లలను నిర్లక్ష్యం చేయడంతో శరమంద మందలించాడు. దీనిపై భార్యాభర్తలకు తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే శనివారం కూడా గొడవ జరగడంతో కల్లు తాగొద్దని, పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి శరమంద పనికి వెళ్లాడు.

మధ్యాహ్నం బిజినేపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లిన లలిత భర్తపై ఫిర్యాదు చేసింది. దీంతో శరమందకు ఫోన్ చేసిన పోలీసులు స్టేషన్ కు రమ్మని పిలిచారు. శరమందతో మాట్లాడి కౌన్సెలింగ్ ఇస్తామని చెప్పి, భర్త వచ్చే వరకూ స్టేషన్ లోనే ఉండాలని చెప్పారు. అయితే, కాసేపటికే లలిత తన పిల్లలను తీసుకుని వెళ్లిపోయింది. నేరుగా సాయిశోభ రైస్ మిల్ సమీపంలోని కేఎల్ఐ కెనాల్ వద్దకు వెళ్లింది. తొలుత ఏడు నెలల కొడుకు మార్కండేయను కాలువలోని నీటిలోకి విసిరేసింది. ఆపై మిగతా ముగ్గురు పిల్లలనూ తోసేసింది. అక్కడికి కాస్త దూరంలో ఉన్న జనం గమనించి వచ్చేలోగా ఇదంతా జరిగింది.

వెంటనే నీళ్లలోకి దిగిన స్థానికులు ఆ పిల్లలను కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. పిల్లలంతా నీట మునిగి చనిపోయారు. సమాచారం అందుకుని అక్కడికి చేరుకున్న పోలీసులు కాలువలో గాలింపు చేపట్టి.. పిల్లల మృతదేహాలను వెలికి తీశారు. మార్కండేయ ఆచూకీ ఇంకా దొరకలేదని పోలీసులు తెలిపారు. శరమంద ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

More Telugu News