Rs 41000: ఒక్క ఎలుకను పట్టడానికి రూ.41,000.. రైల్వేలో విడ్డూరం

  • నార్తర్న్ రైల్వే లక్నో డివిజన్ పరిధిలో ఖర్చు
  • మూడేళ్లలో పట్టిన ఎలుకలు 168
  • సమాచార హక్కు చట్టం దరఖాస్తుకు బదులు
Rs 41000 to catch one rodent Northern Railway

ఓ ఎలుకను పట్టడానికి ఎంత ఖర్చవుతుంది..? వంద రూపాయిలు. లేదంటే వెయ్యి రూపాయిలు. కానీ, రైల్వే శాఖ ఒక్కో ఎలుకను పట్టుకోవడానికి రూ.41,000 ఖర్చు చేసి ఔరా అనిపించింది. నార్తర్న్ రైల్వే లక్నో డివిజన్ సాధించిన ఘనత ఇది. చంద్రశేఖర్ గౌర్ అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం కింద కోరినప్పుడు రైల్వే శాఖ స్వయంగా ఈ వివరాలు తెలియజేసింది. నార్తర్న్ రైల్వే లక్నో డివిజన్ 2020 నుంచి 2022 వరకు ఎలుకలను పట్టడం కోసం రూ.69.5 లక్షలు ఖర్చు పెట్టింది. పట్టిన ఎలుకలు ఎన్నయ్యా? అంటే కేవలం 168 ఎలుకలే. 

ఈ గణాంకాలు చూసిన ఎవరికైనా కళ్లు తిరగక మానదు. ఎలుకలు పట్టడం, చెదల నివారణ ఇవన్నీ ప్రాథమిక మెయింటెనెన్స్ కింద రైల్వే పరిగణిస్తుంటుంది. నార్నర్ రైల్వే పరిధిలో ఢిల్లీ, అంబాలా, లక్నో, ఫిరోజ్ పూర్, మొరాదాబాద్ డివిజన్లు ఉన్నాయి. చంద్రశేఖర్ గౌర్ నార్నర్ రైల్వే వ్యాప్తంగా సమాచారం కోరగా.. ఒక్క లక్నో డివిజన్ మాత్రమే స్పష్టమైన సమాచారం ఇచ్చింది. ఎలుకల కారణంగా జరిగిన నష్టం ఎంత? అన్న గౌర్ ప్రశ్నకు లక్నో డివిజన్ కూడా సమాచారం ఇవ్వలేదు. నష్టపోయిన గూడ్స్, వస్తువులకు సంబంధించిన సమాచారం లేదని పేర్కొంది. అంబాలా డివిజన్ 2020 ఏప్రిల్ నుంచి 2023 మార్చి వరకు ఎలుకలు, చెదల నివారణకు రూ.39.3 లక్షలు ఖర్చు చేసింది.

More Telugu News