Pattabhi: స్కిల్ అంశంలో అవినీతి అని వైసీపీ ప్రభుత్వం, సీఐడీ చెబుతున్న కట్టుకథలకు 35 డాక్యుమెంట్లతో ముగింపు పలికాం: పట్టాభిరామ్

  • స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్
  • చంద్రబాబు అవినీతికి పాల్పడ్డాడంటున్న ప్రభుత్వం, సీఐడీ
  • మీడియా సమావేశంలో పాయింట్ టు పాయింట్ సమాధానమిచ్చిన పట్టాభి
  • చర్చకు వచ్చే దమ్ముందా అంటూ సజ్జల, సీఐడీ చీఫ్ సంజయ్ లకు సవాల్
Pattabh press meet over Skill Development issue

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో తమ అధినేత చంద్రబాబుపై సీఐడీ చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టేందుకు టీడీపీ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తాజాగా, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మీడియా సమావేశం నిర్వహించి, చంద్రబాబుపై వచ్చిన ఆరోపణలకు పాయింట్ టు పాయింట్ సమాధానమిచ్చారు. 

సజ్జల రామకృష్ణారెడ్డి, సీఐడీ చీఫ్ సంజయ్, న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి మీడియా ముందు మిడిమిడి జ్ఞానంతో మాట్లాడి పాత్రికేయులు నోరు తెరవగానే జారుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కట్టుకథలు, కల్లబొల్లి మాటలు, తమకు అనుకూలంగా అంతకుముందే సిద్ధం చేసుకున్న అబద్ధాలతో చంద్రబాబు తప్పు చేశాడని ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. 

సీఐడీ, జగన్ సర్కార్ లేవనెత్తిన అన్ని ఆరోపణలను నేడు ఆధారాలతో సహా ఎండగట్టామని అన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ కు సంబంధించి సీఐడీ, వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణల్నీ అవాస్తవాలని మొత్తం 35 డాక్యుమెంట్ల ద్వారా ఆధారాలతో సహా నిరూపించాను అని పట్టాభి వెల్లడించారు. తాను బయట పెట్టిన అంశాలపై బహిరంగంగా గానీ, మీడియా సమక్షంలో గానీ చర్చకు వచ్చే దమ్ము, ధైర్యం  సజ్జలకు, సీఐడీ చీఫ్ సంజయ్ కు ఉందా? అని పట్టాభి సవాల్ చేశారు.

సీఐడీ ఆరోపణలు-పట్టాభి వివరణ

సీఐడీ మొదటి ఆరోపణ: సీమెన్స్ గ్లోబల్ సంస్థకు తెలియకుండానే సీమెన్స్ ఇండియా సంస్థతో, నాటి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని పదేపదే దుష్ప్రచారం చేయడం పూర్తిగా అవాస్తవం.

వాస్తవం: సీమెన్స్ సంస్థకు తెలిసే స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ ఒప్పందం జరిగింది. మనదేశంలోని దాదాపు 9 రాష్ట్రాలకు ఎలాగైతే సీమెన్స్ గ్లోబల్ సహాయ సహకారాలు అందించిందో, అదే విధంగా ఏపీ ప్రభుత్వంతో కూడా ఒప్పందం చేసుకుంది. 

రాష్ట్ర ప్రభుత్వం, సీమెన్స్ ఇండియా సాఫ్ట్ వేర్ ప్రైవేట్ లిమిటెడ్, డిజైన్ టెక్ సంస్థలు కలిసి చేసుకున్న త్రైపాక్షిక ఒప్పందాన్ని గమనిస్తే, దానిలో సీమెన్స్ సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ సంతోష్ సావంత్ సంతకం పెట్టారు. ప్రజలకు చెప్పకుండా సీఐడీ, వైసీపీ ప్రభుత్వం ఈ విషయాన్ని ఎందుకు దాస్తోంది? సంతోష్ సావంత్ సంతకం స్పష్టంగా ఒప్పందంలో కనిపిస్తోంది. ఇది ఒక ఆధారమైతే, అదే త్రైపాక్షిక ఒప్పందం తాలూకా అనుబంధ పత్రంలోని వివరాలు గమనిస్తే, సీమెన్స్ సంస్థకు చెందిన ఐటెమ్స్ అన్నీ పొందుపరిచారు. 

అలాగే సీమెన్స్ కంపెనీలో అత్యంత సీనియర్ అధికారిగా పనిచేస్తున్న పీట్ కేరియర్ అనే వ్యక్తి 24 జూన్ 2015న 12.52 నిమిషాలకు డిజైన్ టెక్ ఎండీ వికాస్ ఖాన్విల్కర్ కు ఒక మెయిల్ పంపించారు. మనం గతంలో బాలిలో కలిసినప్పుడు మాట్లాడుకున్న విధంగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఎప్పుడు ఒప్పందం చేసుకోబోతున్నామా అని చాలా ఉత్సుకతతో ఎదురు చూస్తున్నానని పీట్ కేరియర్ తన మెయిల్ లో పేర్కొన్నారు. 

సీమెన్స్ ఇండియా సంస్థ సీఈవో అయిన సునీల్ మాధుర్, ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబుతో సమావేశమయ్యారు. సీమెన్స్ సంస్థకు తెలియకుండా ఆ సంస్థ అధికారి ముఖ్యమంత్రితో ఎలా సమావేశమవుతారు? ఇంత వ్యవహారం జరిగాక కూడా సీమెన్స్ గ్లోబల్ సంస్థకు తెలియకుండానే నాటి టీడీపీ ప్రభుత్వం సుమన్ బోస్ తో ఒప్పందం చేసుకొని అవినీతికి పాల్పడిందంటున్న సీఐడీ వాదన పచ్చి అబద్ధం కాదా?

సీమెన్స్ సంస్థకు ఏమీ తెలియదని చేతులూపుతూ మీడియా ముందు విన్యాసాలు ప్రదర్శించిన సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడేం సమాధానం చెబుతాడు? సీమెన్స్ ఉన్నతాధికారులు పీట్ కేరియర్, సునీల్ మాధుర్ కు తెలియకుండా ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం జరిగిందనడం పచ్చి అబద్ధమని తేలిపోయింది. 

సీఐడీ చేస్తున్న రెండో ఆరోపణ: 90:10 నిష్పత్తి ప్రకారం నిధులు కేటాయింపు జరగలేదు... స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ అమలుకు అవసనమైన నిధుల్లో సీమెన్స్  సంస్థ 90 శాతం నిధులు కేటాయించలేదని ఏపీ ప్రభుత్వమే ఆ వంకతో నిధులు దారిమళ్లించిందని పదేపదే చెప్పడం.

వాస్తవం: స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ అమలుకు సంబంధించి 2015 ఫిబ్రవరి 16న విడుదల చేసిన కేబినెట్ రిజల్యూషన్ లో చాలా స్పష్టంగా సీమెన్స్ సంస్థ 90 శాతం గ్రాంట్ గా ఇస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం కేవలం 10 శాతం నిధులే భరిస్తుందని పేర్కొన్నారు. కౌన్సిల్ రిజల్యూషన్ నెం 33/2015 గమనిస్తే దీనికి సంబంధించిన వాస్తవం సీఐడీకి, జగన్ ప్రభుత్వానికి బోధపడుతుంది. చంద్రబాబు ఏం చేసినా చాలా పారదర్శకంగా చేస్తారు అనడానికి కేబినెట్ రిజల్యూషనే సాక్ష్యం. 

90 శాతం నిధులు గ్రాంట్ ఇన్ ఎయిడ్... కేవలం పది శాతం నిధులే ఏపీ ప్రభుత్వం భరిస్తుందని చెబుతున్న రిజల్యూషన్ ను ఎందుకు తొక్కిపెడుతున్నారో సీఐడీ చీఫ్ సంజయ్, సజ్జల రామకృష్ణారెడ్డి సమాధానం చెప్పాలి. రిజల్యూషన్ తో పాటు జీవో నెం-4 లో కూడా నిధుల కేటాయింపు వాటా వివరాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. కేబినెట్ రిజల్యూషన్, జీవోలో చాలా స్పష్టంగా నిధుల వాటా వివరాలు పేర్కొన్నాక, జరిగిన ఇతర ఒప్పందాల్లో 90:10 వివరాలు లేవని వీళ్లు చెప్పడం కూడా అబద్ధమే. 

డిసెంబర్ 4, 2015న సీమెన్స్ స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ కు సంబంధించి, నాటి అధికారి ఎల్.ప్రేమచంద్రారెడ్డి చేసుకున్న ఓవర్ ఆల్ వాల్యుయేషన్ తాలూకా అండర్ టేకింగ్ అగ్రిమెంట్ లో కూడా, రాష్ట్ర ప్రభుత్వ వాటా జీవో నెం-4 కు అనుగుణంగా పది శాతానికి మించదని స్పష్టంగా పేర్కొనడం జరిగింది. అండర్ టేకింగ్ అగ్రిమెంట్ లో సదరు అధికారి సంతకం ఉన్నా ఆయన్ని ఈ ప్రభుత్వం గానీ, సీఐడీ గానీ ప్రశ్నించవు. 

ప్రాజెక్ట్ మానిటరింగ్ కమిటీలో ఉన్న షంషేర్ సింగ్ రావత్, అజయ్ జైన్ లాంటి అధికారుల్ని కూడా సీఐడీ ఎందుకు విచారించడంలేదు? ఎల్.ప్రేమచంద్రారెడ్డి చేసుకున్న అండర్ టేకింగ్ అగ్రిమెంట్ లో చాలా స్పష్టంగా  మొత్తం స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ విలువ రూ.3,356 కోట్లు.

అయితే, దానిలో రాష్ట్ర ప్రభుత్వ వాటా కేవలం 10 శాతమేనని పేర్కొంటూ, ప్రతి క్లస్టర్ కు ఆ 10శాతానికి గాను రూ.55 కోట్లు మాత్రమే ప్రభుత్వం చెల్లిస్తుందని, అంతకుమించి ఒక్క పైసా చెల్లించదని అగ్రిమెంట్లో పొందుపరిచారు. 90:10 నిధులకు సంబంధించి అసలు వాస్తవాలు ఇంత స్పష్టంగా ఇన్ని రకాలుగా కనిపిస్తుంటే నాటి టీడీపీ ప్రభుత్వమే మొత్తం నిధులు కేటాయించిందని చెప్పడం పచ్చి అబద్ధం.  

సీఐడీ 3వ ఆరోపణ: స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ లో భాగంగా శిక్షణా కేంద్రాలకు సరఫరా చేసిన పరికరాలు, సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన వాల్యూయేషన్ పై చేస్తున్న ఆరోపణలు

వాస్తవం: 2016 మార్చి 22న సెంట్రల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ (సీఐటీడీ) ఇచ్చిన వాల్యుయేషన్ రిపోర్ట్ పరిశీలిస్తే శిక్షణా కేంద్రాల్లో ఎలాంటి పరికరాలు, ఎటువంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఉందో సీఐడీ వారికి కనిపిస్తుంది. సీమెన్స్ సంస్థ అందించిన సాఫ్ట్ వేర్ వ్యాల్యుయేషన్  వివరాలకు సంబంధించిన వాల్యుయేషన్ అంతా బోగస్ అన్నట్టు సజ్జల మాట్లాడాడు. 

ప్రజలకు పనికొచ్చే ప్రాజెక్టుల వాల్యుయేషన్లు సజ్జలకు, జగన్ రెడ్డికి ఏం తెలుస్తాయి. అవినీతి, దోపిడీ వాల్యుయేషన్లు అయితే ఇద్దరికీ బాగా తెలుస్తాయి. వాళ్ల ఖజానాను నింపే ఇసుక, మద్యం, గంజాయి, తదితర వాటికి సంబంధించిన వాల్యుయేషన్లు అయితే వాళ్ల నాలుకల మీదనే ఉంటాయి. 

సీఐటీడీ వారు చాలా స్పష్టంగా ప్రాజెక్ట్ లో భాగంగా ఏర్పాటైన 6 క్లస్టర్లలో ఒక్కో క్లస్టర్ వాల్యుయేషన్ రూ.559 కోట్లు అయితే, 6 క్లస్టర్ల వ్యాల్యుయేషన్ రూ.3,300 కోట్లు అని పేర్కొన్నా రు. దానిలో సాఫ్ట్ వేర్స్ విలువ రూ.247 కోట్లని, డిజిటల్ కోర్సుల కోసం అందించిన పరిజ్ఞానం, పరికరాల విలువ రూ.249 కోట్లు అని చాలా స్పష్టంగా పేర్కొన్నారు. రెండూ కలిపి సుమారు రూ.496 కోట్లు... అంటే దాదాపు ప్రతి క్లస్టర్ వాల్యుయేషన్లో 90 శాతం. 

ఇదంతా కేంద్ర ప్రభుత్వ సంస్థ సీఐటీడీ చెప్పిందే. మరి సీఐటీడీ తప్పుడు వాల్యుయేషన్ చేసిందని ఆ సంస్థపై జగన్ రెడ్డి ప్రభుత్వం, సీఐడీ కేసు పెట్టగలవా? సీఐటీడీ అధికారుల్ని తీసుకొచ్చి విచారించగలరా? సీఐటీడీ వాల్యుయేషన్ కాపీ సజ్జల వద్ద లేదా? 

సీమెన్స్ సంస్థ సదరన్ వర్జీనియా విశ్వవిద్యాలయానికే దాదాపు రూ.750 కోట్ల (94 మిలియన్లు) విలువైన సాఫ్ట్ వేర్ అందించింది. సిన్సినాటి స్టేట్ అండ్ టెక్నికల్ కమ్యూనిటీ కాలేజీ వారికి రూ.500 కోట్ల విలువైన (66.8 మిలియన్లు)  సాఫ్ట్ వేర్ అందించింది. ఈ విషయం సదరు విద్యాసంస్థలే చెప్పాయి. ఇంత గొప్ప విశ్వవిద్యాలయాలకు సీమెన్స్ సంస్థ సాఫ్ట్ వేర్ విలువ ఏమిటో తెలిసింది కానీ సజ్జలకు తెలియలేదు. ఎప్పుడైనా ఇలాంటి వాటి గురించి ఆలోచించిన ముఖమైతే కదా! 

అంత విలువైన సాఫ్ట్ వేర్ని చంద్రబాబునాయుడు రాష్ట్రంలోని యువతకు మంచి ఉద్యోగావకాశాలు కల్పించడానికి మన స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లలో అందుబాటులోకి తీసుకొస్తే, నేడు దురదృష్టవశాత్తూ ఆయనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారు.

సీఐడీ 4వ ఆరోపణ:  ఒకే వ్యక్తికి (గంటాసుబ్బారావు) నాలుగు పదవులు  ఇచ్చారు.

వాస్తవం: ప్రపంచవ్యాప్తంగా పేరుప్రఖ్యాతులు పొందిన ఐటీ రంగ నిపుణుడు గంటా సుబ్బారావు గొప్పతనం ఈ వైసీపీ గొర్రెల మందకు ఏం తెలుస్తుంది? అమెరికాలో ప్రముఖ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న సుబ్బారావుని, రాష్ట్రానికి తీసుకొచ్చి ఐటీ పరిజ్ఞానం ఉమ్మడి ఏపీ యువతకు అందించాలని చంద్రబాబు కోరారు. అదే సుబ్బారావుని తరువాత ముఖ్యమంత్రి అయిన రాజశేఖర్ రెడ్డి కూడా కొనసాగించారు. 

ఉమ్మడి రాష్ట్ర ఐటీ విభాగం సీఐవో మరియు ఈవోగా, ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ గవర్నెన్స్ ప్రెసిడెంట్ గా, చీఫ్ మినిస్టర్ ప్రత్యేక కార్యదర్శిగా సుబ్బారావుకి రాజశేఖర్ రెడ్డి మూడు పదవులు ఇచ్చి మరీ తన ప్రభుత్వంలో కొనసాగేలా చేశారు. అలాంటి వ్యక్తి జగన్ రెడ్డికి, అతని ప్రభుత్వానికి తప్పుడు మనిషిగా కనిపిస్తున్నారు. గంటా సుబ్బారావుకి పదవులు ఇచ్చాడు కాబట్టి రాజశేఖర్ రెడ్డిపై కూడా బురద జల్లుతారా? 

చంద్రబాబు నాలుగు పదవులు ఇచ్చారని చెబుతున్న జగన్ రెడ్డి, అతని ప్రభుత్వం, సీఐడీ... రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన పదవులపై ఏం సమాధానం చెబుతారు? జగన్ రెడ్డి తనకు నచ్చిన వారికి మూడు, నాలుగు పదవులు కట్టబెట్టలేదా? రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో గంటా సుబ్బారావు చేసిన సేవల్ని కొనియాడి సన్మానించారు కూడా.
 
సీఐడీ చేస్తున్న 5వ ఆరోపణ: స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ అమలు కాలేదు... శిక్షణా కేంద్రాల్లో ఏమీ లేవని చేస్తున్న దుష్ప్రచారం.

వాస్తవం: స్కిల్ డెవలప్ మెంట్  శిక్షణా కేంద్రాలను పరిశీలించి శరత్ అసోసియేట్స్ అనే ఆడిట్ సంస్థ ఇచ్చిన నివేదిక ఆధారంగానే సీఐడీ వారు ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేశారు. కానీ శరత్ అసోసియేట్స్ సంస్థ ఇచ్చిన ఆడిట్ రిపోర్ట్ లో ఏముందంటే... ఆడిట్ రిపోర్ట్ పేజీ నెం -12లో చాలా స్పష్టంగా వైసీపీ ప్రభుత్వం మమ్మల్ని స్కిల్ డెవలప్ మెంట్ శిక్షణా కేంద్రాల్లో ఆడిట్ చేయమన్నది నిజమేనని, కానీ శిక్షణా కేంద్రాల్లో తాము ఫిజికల్ వెరిఫికేషన్ చేయలేదని చెప్పారు. 

వైసీపీ ప్రభుత్వమే తమను ఫిజికల్ వెరిఫికేషన్ చేయవద్దని కూడా చెప్పిందని, ముందు ఫిజికల్ వెరిఫికేషన్  చేయమని చెప్పి, తరువాత వద్దన్నారని శరత్ అసోసియేట్స్ సంస్థ చెప్పింది. శరత్ అసోసియేట్స్ సంస్థను శిక్షణా కేంద్రాల్లో ఫిజికల్ వెరిఫికేషన్ ఎందుకు చేయవద్దన్నారో జగన్ రెడ్డి, వైసీపీ ప్రభుత్వం, సీఐడీ సమాధానం చెప్పాలి. 

స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ శిక్షణా కేంద్రాలకు వెళితే అక్కడ ఎలాంటి పరికరాలు, సాంకేతిక పరిజ్ఞానం ఉందో కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంది. అలానే ప్రాజెక్ట్ అమల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన శిక్షణా కేంద్రాల (ప్రముఖ విశ్వవిద్యాలయాలు)వారు తమ తమ కాలేజీల్లో సీమెన్స్ నైపుణ్యాభివృద్ధి శిక్షణా కేంద్రాలు అద్భుతంగా పనిచేస్తున్నాయని లేఖల ద్వారా స్పష్టం చేశారు. 

కేవలం లేఖలు రాయడమే కాకుండా  ప్రాజెక్ట్ లో భాగంగా తమ విశ్వవిద్యాలయా ల్లోని శిక్షణాకేంద్రాలకు రావాల్సిన పరికరాలు అందాల్సిన సాంకేతిక పరిజ్ఞానం అందిందని ధ్రువీకరిస్తూ స్టాక్ రిజిస్టర్లలో సంతకాలు కూడా పెట్టి ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కు అందచేశారు. ఆ విధంగా 40 శిక్షణా కేంద్రాల యాజమాన్యాలు సంతకాలు పెట్టాయి. వాటిలో జీఎంఆర్, జి.పుల్లారెడ్డి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యాలతో పాటు ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ డెరెక్టర్ శ్రీమతి కే. సంధ్యారాణి ఆగస్ట్ 6, 2021న పెట్టిన సంతకం కూడా ఉంది. 

ఇంత స్పష్టంగా స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్  శిక్షణా కేంద్రాలకు అందాల్సిన పరికరాలు, సాఫ్ట్ వేర్ అందినట్టు కనిపిస్తుంటే, అక్కడ ఏమీ లేవని సజ్జల, సీఐడీ చీఫ్ సంజయ్ లు చెప్పడం పచ్చి అబద్ధంకాక మరేమిటి?

More Telugu News