Birth Certificate: వచ్చే నెలలో కీలక మార్పు.. అతిముఖ్యమైన డాక్యుమెంట్‌గా బర్త్ సర్టిఫికేట్

  • అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్న రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్-2023 చట్టం
  • ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసిన హోం మంత్రిత్వ శాఖ
  • కొత్త చట్టం ఆధారంగా జాతీయస్థాయిలో జనన మరణాల ఏకీకృత డేటాబేస్ ఏర్పాటు
  • అన్ని రకాల అధికారిక డాక్యుమెంట్ల జారీకి కీలకంగా మారనున్న జనన ధ్రువీకరణ పత్రం
Birth Certificate To Be Single Document For Aadhaar Driving Licence Admissions Other Sectors From October 1

అక్టోబర్ 1 నుంచి దేశప్రజలకు బర్త్ సర్టిఫికేట్ అతి ముఖ్యమైన డాక్యుమెంట్‌గా మారనుంది. కాలేజీల్లో అడ్మిషన్లు, డ్రైవింగ్ లైసెన్స్ జారీ, వోటర్ల లిస్టులో పేరు నమోదు, ఆధార్ కేటాయింపు, వివాహ రిజిస్ట్రేషన్లు వంటి వాటికి అవసరమైన ఒకే ఒక కీలక డాక్యుమెంట్‌గా మారనుంది. ఈ దిశగా పార్లమెంట్ రూపొందించిన రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్ (అమెండ్‌మెంట్) చట్టం-2023 వచ్చే నెల ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానుంది. ఈ మేరకు హోం మంత్రిత్వ శాఖ తాజాగా కీలక నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రభుత్వం భవిష్యత్తులో పేర్కొనే ఇతర అవసరాలకు బర్త్ సర్టిఫికేట్ అవసరం ఉంటుందని కూడా హోం మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో స్పష్టం చేసింది. 

ఈ చట్టంతో దేశవ్యాప్తంగా జననమరణాలకు సంబంధించి ఏకీకృత డేటాబేస్ సిద్ధమవుతుందని కేంద్రం పేర్కొంది. ఫలితంగా, మరింత సమర్థవంతంగా ప్రజాసేవలు అందుబాటులోకి వస్తాయని వెల్లడించింది. 

గత నెలలో ముగిసిన సమావేశాల్లో పార్లమెంట్ ఈ చట్టాన్ని ఆమోదించింది. ఆగస్టు 1న లోక్‌సభ ఈ బిల్లుకు ఆమోదముద్ర వేయగా ఆగస్టు 7న రాజ్యసభ మూజువాణి వోటుతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 1969 చట్టాన్ని సవరిస్తూ కేంద్రం ఈ కొత్త చట్టాన్ని తెచ్చింది. 

రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జాతీయస్థాయిలో జననమరణాల డాటాబేస్ రూపొందించేందుకు ఈ చట్టం అవకాశం కల్పించింది. అంతేకాకుండా, రాష్ట్రాల్లోని చీఫ్ రిజిస్ట్రార్లు, స్థానిక సంస్థల్లోని రిజిస్ట్రార్లు తమ పరిధిలోని జననమరణాల వివరాలను జాతీయ డాటాబేస్‌లో పొందుపరచాల్సి ఉంటుంది. అంతేకాకుండా, శిశువుల జననాల రిజిస్ట్రేషన్ సమయంలో తల్లిదండ్రులు ఆధార్ వివరాలు కూడా నమోదు చేయాల్సి ఉంటుంది.

More Telugu News