China: రెండు వారాలుగా జాడ లేని చైనా రక్షణ మంత్రి

  • ప్రజల ముందుకు రాని లీ షాంగ్ఫూ
  • జపాన్ లో అమెరికా రాయబారి దీనిపై ఓ ట్వీట్
  • విచారణను ఎదుర్కొంటూ ఉండొచ్చని సందేహం
Chinas defence minister missing for over 2 weeks under investigation

చైనా రక్షణ మంత్రి లీ షాంగ్ఫూ కనిపించడం లేదు. అవును మీరు వింటున్నది నిజమే. రెండు వారాల నుంచి ఆయన జాడ లేదు. బహిరంగంగా కనిపించడం లేదు. దీంతో లీ షాంగ్ఫూ విచారణను ఎదుర్కొంటూ ఉండొచ్చని అమెరికా ప్రభుత్వం భావిస్తోంది. మరింత సంచలన విషయం ఏమిటంటే రక్షణ మంత్రి బాధ్యతల నుంచి ఆయన తొలగింపునకు గురై ఉంటారన్నది అమెరికా అంచనా. ఈ వివరాలను ఫైనాన్షియల్ టైమ్స్ ప్రచురించింది. 

దీనిపై జపాన్ లో అమెరికా రాయబారి రెహమాన్ ఎమాన్యుయేల్ ట్విట్టర్ లో ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘‘ప్రెసిడెంట్ షీ జిన్ పింగ్ కేబినెట్ లైనప్ అనేది ఇప్పుడు అగాథా క్రిస్టీ నవల అయిన ‘అండ్ దెన్ దేర్ వర్ నన్’ను తలపిస్తోంది. మొదట చైనా విదేశాంగ మంత్రి కిన్ గాంగ్ అదృశ్యమయ్యారు. తర్వాత రాకెట్ ఫోర్స్ కమాండర్లు కనిపించకుండా పోయారు. ఇప్పుడు రక్షణ మంత్రి లీ షాంగ్ఫూ రెండు వారాల నుంచి ప్రజలకు కనిపించడం లేదు’’ అని ట్వీట్ లో పేర్కొన్నారు. లీ షాంగ్ఫూ హౌస్ అరెస్ట్ కు గురై ఉండొచ్చని భావిస్తున్నారు. 

చైనా విదేశాంగ మంత్రి కిన్ గాంగ్ సైతం జూలైలో అదృశ్యమయ్యారు. రెండు నెలల క్రితం చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ రాకెట్ ఫోర్స్ కు చెందిన ఇద్దరు జనరళ్లను తొలగించారు. చైనాలో ప్రముఖులు అదృశ్యం కావడం లేదా కనిపించకుండా పోవడం అనేది ఎప్పటి నుంచో ఉంది. చైనాకు చెందిన దిగ్గజ వ్యాపారవేత్త, అలీబాబా గ్రూప్ అధినేత జాక్ మా కూడా రెండేళ్లపాటు కనిపించకుండా పోవడం గమనార్హం. అలా జరగడానికి ముందు ఆయన చైనా సర్కారు వైఖరిని తప్పుబట్టారు. చైనా సర్కారు, సర్కారు విధానాలను తప్పుబట్టినా, లేదంటే తమ విధుల్లో బాధ్యతారాహిత్యం, నిర్లక్ష్యం చూపించినా.. వారిని రహస్య ప్రదేశాల్లో బంధిస్తారన్న సందేహాలు నెలకొన్నాయి.

More Telugu News