K Kavitha: ఒక ఆడబిడ్డకు కష్టం రావద్దు: కల్వకుంట్ల కవితకు విజయశాంతి సానుభూతి

  • ఢిల్లీ మద్యం కుంభకోణంలో మళ్లీ ఈడీ నోటీసులు అందుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత
  • ఒక ఆడబిడ్డకు కష్టం రాకూడదంటూ బీజేపీ నేత విజయశాంతి సానుభూతి
  • ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులతో బీజేపీకీ ఏ సంబంధం లేదని స్పష్టీకరణ
  • ఏ ఆడబిడ్డ అయినా నిర్దోషిగా నిలవాలని తాను వ్యక్తిగతంగా కోరుకుంటానని వెల్లడి
Vijayashanthi express solidarity with kavitha over ED notices in Delhi liquor scam but emphasizes BJP has nothing to gain from it

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మరోసారి ఈడీ నోటీసులు అందుకున్న బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీజేపీ నేత మాజీ ఎంపీ విజయశాంతి సానూభూతి వ్యక్తి చేశారు. ఒక ఆడబిడ్డకు ఇలాంటి కష్టం రాకూడదని వ్యాఖ్యానించారు. అయితే, ఈ నోటీసులు కక్ష్య సాధింపు చర్యలో భాగమని కవిత పేర్కొనడాన్ని మాత్రం తప్పుబట్టారు. ఈ పరిణామంపై తన అభిప్రాయాలను సోషల్ మీడియా ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. 

‘‘ఎమ్మెల్సీ కవిత గారు అరెస్ట్ కావాలని కోరుకోవడం రాజకీయంగా బీజేపీకి అవసరం కాదు. ఆ ఆవశ్యకత కూడా లేదు. దేశంలోని అనేక రాష్ట్రాలలోని ఆయా సమస్యలపై నిర్దేశించబడ్డ ప్రభుత్వ సంస్థలైన ఈడీ, సీబీఐలు తమ నిర్వహణ చేస్తాయి. ఎంఐఎం ప్రేరేపిత ధోరణి కలిగిన కొందరు కవిత గారు అరెస్ట్ కానట్లయితే... బీజేపీ, బీఆరెస్ ఒక్కటే అన్న భావంతో బీఆరెస్‌కు వ్యతిరేకంగా ఓటు చెయ్యవచ్చన్న భయం బీఆరెస్‌కు ఉందేమో గానీ జాతీయవాద బీజేపీకి ఆ ఆలోచనా ధోరణి ఉండదు. గతంలో ఒకసారి అప్రూవర్‌గా ఉండి.. మళ్లీ కిలాఫ్‌గా మారి.. తిరిగి ఈ రోజు అప్రూవర్‌గా మారుతున్నోళ్లు బీఆర్ఎస్ ప్రోద్బలంతోనే ఇయ్యన్నీ చేస్తున్నారనే అభిప్రాయం వినవస్తున్నది.

ఇక, ఒక ఆడబిడ్డకు కష్టం రావద్దు... ఆరోపణలున్న ఏ ఆడబిడ్డ అయినా నిర్దోషులుగానే ఎప్పుడూ నిలవాలని మాత్రం వ్యక్తిగతంగా రాములమ్మ ఎన్నటికీ కోరుకుంటాది’’ అంటూ విజయశాంతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

More Telugu News