asia cup: పాకిస్థాన్ ప్యాకప్.. భారత్ తో తుదిపోరుకు శ్రీలంక

  • సూపర్4 మ్యాచ్ లో పాక్ పై శ్రీలంక ఉత్కంఠ విజయం
  • ఆఖరి బంతికి లక్ష్యాన్ని అందుకున్న లంక
  • ఆదివారం టీమిండియా, శ్రీలంక మధ్య ఫైనల్ పోరు
Sri Lanka make Asia Cup final

ఆఖరి బంతికి పాకిస్థాన్ పై ఉత్కంఠ విజయం సాధించిన శ్రీలంక ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్ లో ఫైనల్ చేరుకుంది. టీమిండియాతో టైటిల్ ఫైట్ కు రెడీ అయింది. వర్షం కారణంగా కొలంబోలో నిన్న అర్ధరాత్రి వరకూ జరిగిన సూపర్ ఫోర్ మ్యాచ్‌లో శ్రీలంక డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో రెండు వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ జట్టుపై విజయం సాధించింది. వర్షం కారణంగా ఆట ఆలస్యం కావడంతో మ్యాచ్‌ను 42 ఓవర్లకు కుదించారు. టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. మహ్మద్ రిజ్వాన్ అత్యధికంగా 86 పరుగులు చేశాడు. సౌద్ షఫీక్ 52, ఇఫ్తికార్ అహ్మద్ 47 పరుగులతో రాణించారు. శ్రీలంక బౌలర్లలో మతీషా పతిరణ 3 వికెట్లు, ప్రమోద్ మదుషన్ రెండు, దునిత్ వెల్లాలగే ఒక వికెట్ పడగొట్టారు. 

అనంతరం డక్ వర్త్ పద్ధతిలో శ్రీలంక విజయ లక్ష్యాన్ని 252 పరుగులుగా లెక్కగట్టగా.. లంక కూడా 42 ఓవర్లలోనే 8 వికెట్లు కోల్పోయి దాన్ని చేరుకుంది. శ్రీలంక తరఫున కుశాల్ మెండిస్ 91 పరుగులతో లంక విజయంలో కీలక పాత్ర పోషించాడు. సమరవిక్రమ (48) ఆకట్టుకున్నాడు. చివరి రెండు బంతుల్లో ఆరు పరుగులు అవసరం అవగా 4,2 కొట్టి అసలంక (49 నాటౌట్) లంకను గెలిపించాడు. పాకిస్థాన్ బౌలర్లలో ఇఫ్తికార్ అహ్మద్ మూడు వికెట్లు తీయగా, షహీన్ అఫ్రిది 2 వికెట్లు తీశారు. ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్‌లో భారత్‌తో శ్రీలంక తలపడనుంది. పాక్, శ్రీలంక జట్లను ఓడించిన భారత్ ఇప్పటికే ఫైనల్ కు అర్హత సాధించింది. ఈ రోజు జరిగే సూపర్ ఫోర్ చివరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో టీమిండియా తలపడుతుంది.

More Telugu News