Antibiotic resistance: ఈ మూడూ ప్రపంచానికి పెను విపత్తులు: జెరోదా నితిన్ కామత్

  • తేనెటీగలు అంతరిస్తే పంటలకు నష్టమన్న కామత్
  • భూసారం కోల్పోకుండా కాపాడుకోవాలని హితవు
  • యాంటీబయాటిక్స్ విచ్చలవిడి వినియోగం వద్దంటూ సూచనలు
Antibiotic resistance death of bees loss of organic carbon Zerodha founder Nithin Kamath green warning

పర్యావరణానికి జరుగుతున్న హానితో వాతావరణంలో వస్తున్న మార్పుల దుష్ప్రభావాలను ప్రపంచం చవిచూస్తూనే ఉంది. అయినా కానీ, పర్యావరణ పరిరక్షణ దిశగా బలమైన అడుగులు పడడం లేదు. వాతావరణంలో మార్పుల ఫలితంగా వర్షాభావం, వరదలు, మండిపోయే ఎండలు, తీవ్ర తుపానులు చూస్తూనే ఉన్నాం. 

ఈ క్రమంలో భూమండలం మానవాళికి సురక్షిత గమ్యంగా ఉండేందుకు ప్రతి ఒక్కరూ తమవంతు కృషి చేయాల్సిన అవసరాన్ని ప్రముఖ వ్యాపారవేత్త, జెరోదా వ్యవస్థాపకుడు నితిన్ కామత్ తెలియజేశారు. అక్షయకల్ప అనే సేంద్రీయ సాగు సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో శశి కుమార్ తో నితిన్ కామత్ చర్చించిన అనంతరం.. ప్రజలు అర్థం చేసుకోవాల్సిన మూడు ముఖ్యమైన అంశాలను తెలియజేశారు. ఇందుకు సంబంధించి ట్విట్టర్ పై ఓ పోస్ట్ పెట్టారు. ఆరోగ్యం, ఆహారం, సుస్థిరత ఈ మూడు భవిష్యత్ తరాలు కూడా భూమిపై నివసించడానికి కావాల్సినవిగా పేర్కొన్నారు. 

యాంటీబయాటిక్ నిరోధకత
‘‘ప్రతీ అనారోగ్యానికి యాంటీబయాటిక్ ను వాడుతుంటాం. ఇదే విధానం పశువులకూ అమలవుతోంది. అవి అనారోగ్యానికి గురైనప్పుడల్లా యాంటీబయాటిక్స్  ఇస్తున్నారు. మితి మీరి యాంటీబయాటిక్స్ వాడడం వల్ల సూక్ష్మజీవులు నిరోధకతను సంతరించుకుంటున్నాయి. ఇవి భవిష్యత్ ఆరోగ్య సమస్యలకు, మరణాలకు కారణమవుతున్నాయి. డైరీ (పాలు, పాల పదార్థాలు), మీట్ ద్వారా కూడా మన శరీరంలోకి యాంటీ బయాటిక్స్ చేరిపోతున్నాయి. ఉదాహరణకు ఆవులు తరచూ వ్యాధులకు గురవుతుంటాయి. వాటి చికిత్సలో భాగంగా యాంటీబయాటిక్స్ ఇస్తున్నారు. ఆవుకు యాంటీబయాటిక్స్ ఇస్తున్నప్పుడు పాలల్లోకి 40 శాతం చేరుతోంది.

అంతరిస్తున్న తేనెటీగలు
పురుగు మందులు, పరాన్న జీవులతో తేనెటీగలు మనలేవు. తేనెటీగలు అంతరిస్తే ప్రపంచంపై పెద్ద ఎత్తున ప్రభావం పడుతుంది. ఎందుకంటే అవి గొప్ప పరాన్న సంపర్క సహాయకులు. తేనెటీగలను కాపాడుకుంటే పంట దిగుబడులు పెరుగుతాయి.

ఆర్గానిక్ కార్బన్
నేలలో సహజ సిద్ధ కార్బన్ తరిగిపోతుండడం, 1 శాతానికి రావడం హెచ్చరిక వంటిది. వ్యవసాయం మనగలగాలంటే ఆర్గానిక్ కార్బన్ కంటెంట్ అధిక స్థాయిలో ఉండాల్సిందే. తక్కువగా ఉంటే, నేల సారం కూడా తగ్గినట్టే.  నేటి రకం ఆరెంజ్ తో పోలిస్తే 50 ఏళ్ల క్రితం నాటి రకం మంచి పోషక విలువలతో ఉండేది. వెనుకటి ఒక్క ఆరెంజ్ ఇప్పుడు మూడింటితో సమానం’’ అని నితిన్ కామత్ వివరించారు.

More Telugu News