నీపా వైరస్ సోకి ఇద్దరు మృతి చెందిన నేపథ్యంలో కేరళకు కేంద్ర బృందం
- కోజీకోడ్ జిల్లాలో నీపా వైరస్ బారిన పడి ఇద్దరు మరణించినట్టు నిర్ధారణ
- మరో ఇద్దరికి ఆసుపత్రిలో చికిత్స
- రాష్ట్రంలో పరిస్థితి సమీక్షించేందుకు కేంద్ర బృందం
- నీపా వైరస్ కట్టడి కోసం రంగంలోకి రాష్ట్ర ప్రభుత్వం
- కంట్రోల్ రూం ఏర్పాటు, మాస్కులు ధరించాలంటూ ప్రజలకు సూచన
నీపా వైరస్ కారణంగా తొలి మరణం ఆగస్టు 30న సంభవించగా మరో వ్యక్తి సోమవారం కన్నుమూశారు. ‘‘రాష్ట్రంలో నీపా వైరస్ ఇన్ఫెక్షన్ ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది. దీని వల్ల ఇద్దరు మరణించారు. మొత్తం నలుగురి శాంపిళ్లు పరీక్షలకు పంపించగా ఇద్దరికి నీపా వైరస్ సోకినట్టు తేలింది. మరో ఇద్దరికి రిపోర్టుల్లో నెగెటివ్ వచ్చింది’’ అని ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఫేస్‌బుక్ పోస్టులో పేర్కొన్నారు.
నీపాకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఇప్పటికే ఓ కంట్రోల్ రూం ఏర్పాటు చేసిన ప్రభుత్వం, ప్రజలు మాస్కులు ధరించాలని సూచించింది. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది.