Pattabhi: స్కిల్ సెంటర్లపై నరేంద్ర మోదీని అడిగే దమ్ముందా జగన్?: పట్టాభిరామ్

  • కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మీడియా సమావేశం
  • స్కిల్ డెవలప్ మెంట్ పథకం ముందు గుజరాత్ లో ప్రారంభమైందని వెల్లడి
  • గుజరాత్ లో 5 సెంటర్లకే రూ.489 కోట్లు ఖర్చు చేశారని వివరణ
  • ఏపీలో 42 సెంటర్లు, 6 ఎక్సలెన్స్ సెంటర్లు ఏర్పాటు చేసినట్టు వెల్లడి
  • అందుకే రూ.371 కోట్లు కేటాయించామన్న పట్టాభి
Pattabhiram challenges CM Jagan

స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో చంద్రబాబుపై అరోపణలు, ఆయన అరెస్ట్ కు దారితీసిన పరిణామాలపై టీడీపీ నేతలు గణాంకాలతో సహా ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్కిల్ డెవలప్ మెంట్ పథకం ముందుగా గుజరాత్ లో ప్రారంభమైందని తెలిపారు. గుజరాత్ లో 5 స్కిల్ సెంటర్లకు రూ.489 కోట్లను అప్పటి గుజరాత్ ప్రభుత్వం (నరేంద్ర మోదీ సీఎంగా ఉన్నారు) కేటాయించిందని వెల్లడించారు. 

అదే సమయంలో సీమెన్స్ తో నాటి ఏపీ ప్రభుత్వం కూడా ఒప్పందం కుదుర్చుకుందని, స్కిల్ డెవలప్ మెంట్ కోసం రాష్ట్రంలో 42 సెంటర్లు, 6 ఎక్సలెన్స్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందని పట్టాభి వివరించారు. అందుకోసం ఏపీ ప్రభుత్వం రూ.371 కోట్లు ఖర్చు చేసిందని అన్నారు. గుజరాత్ ప్రభుత్వం కంటే ఏపీ తక్కువే ఖర్చు చేసినా, వారి కంటే ఎక్కువ సంఖ్యలో స్కిల్ సెంటర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. 

మరి, రూ.489 కోట్లు ఖర్చు చేసి 5 స్కిల్ సెంటర్లే ఎందుకు ఏర్పాటు చేశారో నరేంద్ర మోదీని అడిగే దమ్ము జగన్ కు ఉందా? అని పట్టాభి సవాల్ విసిరారు. స్కిల్ డెవలప్ మెంట్ కోసం గుజరాత్ లోనూ టెండర్లు పిలవలేదని, సీమెన్స్ 90 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం భరించేలా ఒప్పందం కుదిరిందని స్పష్టం చేశారు. 

బైజూస్ తో జగన్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు టెండర్లు పిలిచారా? అని ప్రశ్నించారు. ఏం... కంటెంట్ ఇవ్వడానికి వేరే కంపెనీలే లేవా? బైజూస్ ఒక్కటే ఉందా? అని నిలదీశారు. మీరు ఒప్పందం కుదుర్చుకున్న బైజూస్ దివాలా తీసింది... ఆ కంపెనీపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి... మరి సీమెన్స్ పై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు కదా! అంటూ పట్టాభి వ్యాఖ్యానించారు.

More Telugu News