Libya: తూర్పు లిబియాలో భారీ వరదలు.. 2 వేల మంది మృతి.. వేలాదిమంది గల్లంతు

2000 dead and thousands missing in Libya after storm hit
  • డ్యామ్ తెగడంతో డెర్నా నగరంలోకి వరద
  • సముద్రంలోకి కొట్టుకుపోయిన జనం.. ఇళ్లు
  • 10 అడుగుల మేర ముంచెత్తిన వరద
భారీ తుపాను, ఎడతెరిపి లేని వానల కారణంగా వరదలు సంభవించడంతో తూర్పు లిబియాలో దాదాపు 2 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాదిమంది గల్లంతయ్యారు. డెర్నా నగరంలోకి వరద భారీగా ముంచెత్తడంతో ఆ ప్రాంతంలో దారుణ నష్టం సంభవించింది. డెర్నా పైన ఉన్న డ్యామ్‌లు కూలడంతోనే ఈ విపత్తు సంభవించినట్టు లిబియన్ నేషనల్ ఆర్మీ (ఎల్ఎన్ఏ) తెలిపింది. వరదల కారణంగా చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు సముద్రంలోకి కొట్టుకుపోయినట్టు పేర్కొంది. 

డెర్నాలో 250 మంది ప్రాణాలు కోల్పోయినట్టు నిన్న రెడ్ క్రీసెంట్ ఎయిడ్ గ్రూప్ తెలిపింది. లిబియా 2011లో రాజకీయంగా తూర్పు, పశ్చిమ ప్రాంతాలుగా విడిపోయింది. ట్రిపోలీలో అంతర్జాతీయంగా గుర్తించిన ప్రభుత్వం ఉన్నప్పటికీ తూర్పు ప్రాంతాలపై దానికి నియంత్రణ లేకుండా పోయింది. 

ఈ విపత్తులో 2 వేల మందికిపైగా మరణించారని, వేలాదిమంది గల్లంతయ్యారని తూర్పు ప్రాంత అధికారులు తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నట్టు పేర్కొన్నారు. వరద 10 అడుగుల మేర ముంచెత్తినట్టు స్థానికులు తెలిపారు. పశ్చిమ డెర్నాలో ధ్వంసమైన రోడ్లు, కుప్పకూలిన ఇళ్లతో భయానకంగా ఉన్న దృశ్యాలు సోషల్ మీడియాను ముంచెత్తుతున్నాయి.
Libya
Storm
Derna City
Floods
Dam

More Telugu News