Chandrababu: చంద్రబాబుకు రిమాండ్... ఏసీబీ కోర్టు తీర్పు

  • స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో నిన్న చంద్రబాబు అరెస్ట్
  • నంద్యాల నుంచి కుంచనపల్లి తరలించిన సీఐడీ అధికారులు
  • ఈ ఉదయం ఏసీబీ కోర్టులో హాజరు
  • దాదాపు 8 గంటల పాటు సాగిన వాదనలు
  • తీర్పును రిజర్వ్ లో ఉంచిన న్యాయమూర్తి
ACB court remands Chandrababu for 14 days

టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏసీబీ కోర్టులో తీవ్ర నిరాశ ఎదురైంది. స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబుకు ఏసీబీ కోర్టు ఈ నెల 22 వరకు రిమాండ్ విధించింది. ఆయనను కాసేపట్లో రాజమండ్రి జైలుకు తరలించనున్నారు. 

చంద్రబాబును నిన్న నంద్యాలలో సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనను తొలుత కుంచనపల్లి సిట్ కార్యాలయానికి తరలించి, సుదీర్ఘ సమయం పాటు విచారించారు. వేకువ జామున వైద్య పరీక్షల కోసం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం మళ్లీ సిట్ కార్యాలయానికి తీసుకెళ్లి, అక్కడ్నించి ఏసీబీ కోర్టుకు తరలించారు.

చంద్రబాబు తరఫున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించగా, సీఐడీ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. మధ్యాహ్నానికి వాదనలు పూర్తికాగా, న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ లో ఉంచారు.

ఈ మధ్యాహ్నం నుంచి తీర్పు కోసం ఎదురుచూస్తున్న చంద్రబాబు... తీర్పు వెల్లడిస్తున్న నేపథ్యంలో కోర్టు హాల్లోకి వెళ్లారు. కోర్టు హాల్లోకి 30 మందిని మాత్రమే అనుమతించారు. తీర్పు నేపథ్యంలో కోర్టులో ఉద్విగ్నభరిత వాతావరణం నెలకొంది. తీర్పు నేపథ్యంలో ఏసీబీ కోర్టు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. విజయవాడ సీపీ కాంతిరాణా టాటా భద్రత ఏర్పాట్లను పరిశీలించారు. 

కోర్టు బయట రెండు కాన్వాయ్ లను సిద్ధంగా ఉంచారు. ఒకటి చంద్రబాబు కాన్వాయ్ కాగా, రెండోది పోలీస్ కాన్వాయ్ అని తెలిసింది. కోర్టు పరిసరాల్లో కిలోమీటరు వరకు బారికేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలను నిలిపివేశారు.

More Telugu News