Chandrababu: 409 సెక్షన్ పై అభ్యంతరం వ్యక్తం చేసిన చంద్రబాబు న్యాయవాది

  • విజయవాడ ఏసీబీ కోర్టులో హోరాహోరీగా వాదనలు
  • చంద్రబాబు స్టేట్ మెంట్ రికార్డు చేసిన కోర్టు
  • 409 సెక్షన్ ను ఈ కేసులో పొందుపరచడం కుదరదన్న లూథ్రా
  • 409 సెక్షన్ పెట్టాలంటే ముందు సరైన సాక్ష్యాలు చూపాల్సి ఉంటుందని స్పష్టీకరణ
Chandrababu advocate objects section 409 in Skill Development Scam case

విజయవాడ ఏసీబీ కోర్టులో స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసు విచారణ కొనసాగుతోంది. వాడీవేడిగా వాదనలు కొనసాగుతున్నాయి. చంద్రబాబు స్టేట్ మెంట్ రికార్డు చేయడం పూర్తయింది. 

ఈ కేసులో సీఐడీ రిమాండ్ పిటిషన్ తిరస్కరణ వాదనలకు న్యాయమూర్తి అవకాశం కల్పించారు. ఈ సందర్భంగా చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. ఈ కేసులో 409 సెక్షన్ ను తీసుకురావడం పట్ల లూథ్రా అభ్యంతరం వ్యక్తం చేశారు. 409 సెక్షన్ పెట్టాలంటే ముందు సరైన సాక్ష్యం చూపాలని స్పష్టం చేశారు. ఈ క్రమంలో రిమాండ్ రిపోర్టును తిరస్కరించాలని ఆయన నోటీసు ఇచ్చారు. అంతేకాదు, చంద్రబాబును అరెస్ట్ చేయడానికి వెళ్లిన పోలీసుల ఫోన్ లొకేషన్స్ రికార్డు పరిశీలించాలని కోర్టును కోరారు. 

అటు, సీఐడీ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో ఇప్పటివరకు 8 మందిని అరెస్ట్ చేసినట్టు కోర్టుకు తెలిపారు. నిన్న ఉదయం 6 గంటలకే చంద్రబాబును అరెస్ట్ చేశామని, 24 గంటల్లోపే కోర్టులో ప్రవేశపెట్టామని వెల్లడించారు. 

విచారణ సందర్భంగా.... ఈ కేసులో  చంద్రబాబు పాత్రపై ప్రాథమిక ఆధారాలు ఉన్నాయా? అని న్యాయమూర్తి సీఐడీని ప్రశ్నించారు. చంద్రబాబుకు పీఏ శ్రీనివాస్ ద్వారా ముడుపుల ఆందాయని సీఐడీ వెల్లడించింది. ఈ స్కాంపై ఈడీ కూడా దర్యాప్తు చేస్తోందని, ఈడీ ఇప్పటికే కొందరిని అరెస్ట్ చేసిందని సీఐడీ తెలిపింది. ప్రస్తుతం ఈడీ విచారణ కీలక దశలో ఉందని పేర్కొంది. 

ఈ కేసులో శ్రీనివాస్ తో పాటు మనోజ్ అనే వ్యక్తికి కూడా సెప్టెంబరు 5న నోటీసులు ఇచ్చినట్టు వివరించింది. కానీ వారు నోటీసులకు జవాబులు ఇవ్వకుండా విదేశాలకు పారిపోయారని, చంద్రబాబును కాపాడేందుకు వారు వెళ్లిపోయారని సీఐడీ ఆరోపించింది. వాళ్లను చంద్రబాబే కాపాడుతున్నాడని తమ అనుమానం అని పేర్కొంది.

More Telugu News