Kotamreddy Sridhar Reddy: గృహనిర్బంధం చేయడానికి వచ్చిన పోలీసులపై కోటంరెడ్డి తీవ్ర ఆగ్రహం... వీడియో ఇదిగో!

  • టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్
  • రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతల గృహ నిర్బంధం
  • నెల్లూరులో వేకువజామున కోటంరెడ్డి ఇంటికి పోలీసులు
  • నోటీసులు చూపించాలన్న కోటంరెడ్డి
  • నోటీసుల్లేకుండా ఇంట్లోకి ఎలా వస్తారంటూ  ఆగ్రహం
MLA Kotamreddy fires on plolice who tried to house arrest him

వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే, నెల్లూరు రూరల్ టీడీపీ ఇన్చార్జి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నోటీసులు లేకుండా తన ఇంట అడుగుపెట్టిన పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేస్తున్నారు. 

ఈ నేపథ్యంలో, నెల్లూరులో వేకువజామున ఎమ్మెల్యే కోటంరెడ్డి ఇంటికి కూడా పోలీసులు వచ్చారు. ఆయనను గృహ నిర్బంధం చేసేందుకు ప్రయత్నించారు. అయితే, పోలీసులపై కోటంరెడ్డి తిరగబడ్డారు. నోటీసులు చూపించాలని డిమాండ్ చేశారు. నోటీసులు లేకుండా తన ఇంట్లో ఎలా అడుగుపెడతారంటూ తీవ్ర స్వరంతో ప్రశ్నించారు. 

"ఇది నా ఇల్లు. నోటీసులు లేకుండా నా ఇంట్లోకి ఎలా వస్తారు? షో మీ ద నోటీస్... లేకపోతే బయటికి వెళ్లండి" అంటూ పోలీసులను గేటు బయటికి పంపించివేశారు. అప్పటికీ పోలీసులు వెళ్లకపోవడంతో వారిపై నిప్పులు చెరిగారు. 

"వెళ్లి మీ ఎస్పీతో మాట్లాడుకోండి... ఏం తమాషాగా ఉందా? నడువ్ బయటికి... అధికారం శాశ్వతం అనుకుంటున్నారా? నోటీసులు లేకుండా మా ఇంట్లోకి వచ్చి మా వాళ్లను దబాయిస్తారా? నేను సహకరిస్తానని చెప్పాను. దానికీ ఓ హద్దుంటుంది. వేకువ జామున నాలుగింటికి వచ్చారు... ఇప్పుడు టైమ్ ఎనిమిదైంది... అరెస్ట్ చేయాలంటే నోటీసులు చూపించండి... లేకపోతే ఒళ్లు దగ్గరపెట్టుకుని వ్యవహరించండి" అంటూ కోటంరెడ్డి పోలీసులపై రౌద్రరూపం ప్రదర్శించారు.

More Telugu News