KTR: డబుల్ బెడ్రూం ఇళ్ల అంశంలో అత్యంత కఠినంగా వ్యవహరించండి: కలెక్టర్లకు కేటీఆర్ దిశానిర్దేశం

  • డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణ పథకం దేశంలో ఎక్కడా లేదన్న కేటీఆర్
  • హైదరాబాదులో రూ.50 లక్షల విలువైన ఇంటిని ఉచితంగా ఇస్తున్నామని వెల్లడి
  • రెండో విడతలో 13,300 ఇళ్లను అందజేస్తున్నామని వివరణ
  • ఎక్కడ తప్పు జరిగినా అధికారులదే బాధ్యత అని స్పష్టీకరణ
KTR talks about double bedroom houses

డబుల్ బెడ్రూం ఇళ్ల అంశంపై తెలంగాణ పురపాలక మంత్రి కేటీఆర్ స్పందించారు. తెలంగాణలో అమలు చేస్తున్న డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణ పథకం వంటిది దేశంలో ఎక్కడా లేదని అన్నారు. 560 చదరపు అడుగుల విస్తీర్ణంలో పక్కాగా నివాస గృహం నిర్మించి ఇస్తున్నామని చెప్పారు. 

హైదరాబాదులో ఒక్కో డబుల్ బెడ్రూం ఇంటికి రూ.50 లక్షలు ఖర్చవుతోందని, అయినప్పటికీ పేదలకు ఉచితంగానే ఇస్తున్నామని కేటీఆర్ వెల్లడించారు. హైదరాబాదులో 1 లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మిస్తున్నట్టు తెలిపారు. వాటి నిర్మాణ విలువ రూ.9,100 కోట్లు ఉంటుందని, వాటి మార్కెట్ విలువ రూ.50 వేల కోట్లు పైమాటేనని అన్నారు. 

మొదటి దశలో 11,700 ఇళ్లను అందించామని, ఈ నెల 21న రెండో దశలో మరో 13,300 ఇళ్లను పేదలకు అందజేస్తున్నామని కేటీఆర్ వివరించారు. డబుల్ బెడ్రూం ఇళ్ల లబ్దిదారుల ఎంపికలో ఎవరి ప్రమేయం ఉండదని, ఈ ప్రక్రియ మొత్తం పారదర్శకంగా జరుగుతుందని, అర్హులైన పేదలకు ప్రతి ఒక్కరికీ ఇల్లు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. 

డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణంలో జిల్లా కలెక్టర్లు అత్యంత కఠినంగా వ్యవహరించాలని దిశా నిర్దేశం చేశారు. ఏ స్థాయిలోనైనా అవకతవకలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కలెక్టర్లదేనని స్పష్టం చేశారు. డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణంలో ఏవైనా అక్రమాలు జరిగితే అధికారులే బాధ్యులవుతారని, అధికారులు తప్పు చేస్తే ఉద్యోగం నుంచి తొలగించే స్థాయిలో కఠిన చర్యలు ఉంటాయని మంత్రి కేటీఆర్ హెచ్చరించారు.

డబుల్ బెడ్రూం ఇళ్ల ప్రక్రియలో ఏవైనా సమస్యలు ఎదురైతే, వాటిని ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. అధికారులు నివేదించే అంశాలపై ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. 

ఇక, మూసీ నది పరీవాహక ప్రాంతంలోని వారికి కూడా డబుల్ బెడ్రూం ఇళ్లను కేటాయిస్తామని, ముందుగా మూసీ నది పరీవాహక ప్రాంతంలో భూ ఆక్రమణలను తొలగించాల్సి ఉంటుందని కేటీఆర్ పేర్కొన్నారు.

More Telugu News