Apple: ఐఫోన్ వాడుతున్నారా.. అయితే, వెంటనే అప్ డేట్ చేసుకోండి

  • ఎమర్జెన్సీ సెక్యూరిటీ అప్ డేట్ విడుదల చేసిన యాపిల్ కంపెనీ
  • పెగాసస్ మాల్ వేర్ ను చొప్పించే ప్రయత్నం జరుగుతోందని అలర్ట్
  • ఐఫోన్ సాఫ్ట్ వేర్ లో లోపాలను గుర్తించిన ఇంటర్నెట్ వాచ్ డాగ్
Apple urging iPhone and iPad users to update their devices immediately

ఐఫోన్ వినియోగదారులకు యాపిల్ కంపెనీ సెక్యూరిటీ అలర్ట్ ప్రకటించింది. ఐఫోన్లలో పెగాసస్ మాల్ వేర్ ను చొప్పించే ప్రయత్నం జరుగుతోందని హెచ్చరించింది. దీనిని అడ్డుకోవడానికి సెక్యూరిటీ అప్ డేట్ ను విడుదల చేశామని, వెంటనే ఐఫోన్, ఐపాడ్ సహా ఇతర యాపిల్ ఉత్పత్తులను అప్ డేట్ చేసుకోవాలని వినియోగదారులకు సూచించింది. ఐఫోన్ సాఫ్ట్ వేర్ లోని కొన్ని లోపాలను గుర్తించినట్లు ఇంటర్నెట్ వాచ్ డాగ్ సిటిజన్ ల్యాబ్ వెల్లడించింది. ఈ లోపాలను ఆధారంగా చేసుకుని వాషింగ్టన్ కు చెందిన ఓ ఉద్యోగి ఫోన్ లోకి పెగాసస్ మాల్ వేర్ ను ప్రవేశపెట్టే ప్రయత్నం జరిగిందని తెలిపింది.

సాఫ్ట్ వేర్ లోపాలకు సంబంధించిన వివరాలతో యాపిల్ కంపెనీని అప్రమత్తం చేయగా.. వెంటనే స్పందించిన కంపెనీ వినియోగదారులకు సెక్యూరిటీ అప్ డేట్ ను అందించింది. ఎలాంటి లింక్ లతో సంబంధం లేకుండా.. అసలు ఫోన్ యజమాని ఏం చేయకున్నా సరే ఫోన్ లోకి ఈ మాల్ వేర్ చేరుతుందని యాపిల్ కంపెనీ హెచ్చరించింది. ఒకసారి ఈ మాల్ వేర్ ఎంటరైతే ఫోన్ లోని కెమెరా ఆన్ కావడం, వాయిస్, ఫోన్ కాల్స్ రికార్డ్ అవుతాయని, ఫోన్ లోని కీలక సమాచారం హ్యాకర్లకు చేరుతుందని పేర్కొంది.  కాగా, ఐఫోన్ సాఫ్ట్ వేర్ లో తాము గుర్తించిన లోపాలను ‘జీరో డే బగ్స్’ గా సిటిజన్ ల్యాబ్ పేర్కొంది. అంటే ఈ లోపాలను సరిదిద్దడానికి ఒక్క రోజు కూడా సమయంలేదని ఆ కంపెనీ వెల్లడించింది.

More Telugu News