HomeGuard: ఆత్మహత్యాయత్నం చేసిన హోంగార్డు కన్నుమూత

  • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస వదిలిన రవీందర్
  • ఉన్నతాధికారులు అవమానం భరించలేక ఆత్మహత్యాయత్నం
  • పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకోవడంతో 70 శాతం కాలిన శరీరం
  • డీఆర్డీవో ఆసుపత్రి ముందు ఉద్రిక్తత.. పెద్ద సంఖ్యలో చేరుకుంటున్న హోంగార్డులు
HomeGuard Ravinder Dead in DRDO Hospital

ఉన్నతాధికారులు అవమానించారని ఆత్మహత్యాయత్నం చేసిన హైదరాబాదులోని హోంగార్డు రవీందర్ కన్నుమూశాడు. డీఆర్డీవో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున తుదిశ్వాస వదిలాడు. ఆసుపత్రి వైద్యులు ఓ ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు. రవీందర్ మృతితో ఆసుపత్రి ముందు ఉద్రిక్తత నెలకొంది. ఇప్పటికే విధులు బహిష్కరించి ఆందోళన చేస్తున్న హోంగార్డులు పెద్ద సంఖ్యలో డీఆర్డీవో ఆసుపత్రి వద్దకు చేరుకుంటున్నారు.

పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండడంతో ఆసుపత్రి వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. రవీందర్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, చాంద్రాయణగుట్ట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో హోంగార్డుగా పనిచేస్తున్న రవీందర్ ఉప్పుగూడలో భార్యా పిల్లలతో కలిసి నివసిస్తున్నారు. ఆయన భార్య సంధ్య, ఇద్దరు కుమారులు మనీశ్, కౌశిక్ ఉన్నారు.

తనకు రావాల్సిన జీతం కోసం హెడ్డాఫీసుకు వెళ్లగా అక్కడ ఏఎస్సై నర్సింగ్ రావు, కానిస్టేబుల్ చందుతో పాటు మరో ఇద్దరు అవమానించారని రవీందర్ మరణ వాంగ్మూలంలో చెప్పారు. తనకు జరిగిన అన్యాయం ఇతర హోంగార్డులకు జరగకుండా చూడాలని రవీందర్ వేడుకున్నారు. అసభ్య పదజాలంతో దూషించడంతో తట్టుకోలేక పెట్రోల్ పోసుకుని రవీందర్ నిప్పంటించుకున్నారు.

వెంటనే మంటలు ఆర్పిన పోలీసులు.. రవీందర్ ను తొలుత ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి కంచన్ బాగ్ లోని అపోలో డీఆర్డీవో ఆసుపత్రికి తీసుకెళ్లారు. రవీందర్ శరీరం 70 శాతం కాలిపోయిందని వెల్లడించిన వైద్యులు.. ఆయనను ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో చేర్చి చికిత్స అందించారు. అయితే, మూడు రోజుల తర్వాత చికిత్స పొందుతూనే రవీందర్ కన్నుమూశారు.

More Telugu News