Bengaluru Auto Driver: బెంగళూరు వెళ్తే వెళ్లారు కానీ.. ఆటోలు ఎక్కేటప్పుడు జాగ్రత్త.. ఎందుకో ఈ వీడియో చూడండి!

  • బెంగళూరులో బంగ్లాదేశ్ యూట్యూబర్‌కు చేదు అనుభవం
  • రైడ్ పూర్తయ్యాక రూ. 500 నోటు చేతికిస్తే.. దానిని క్షణాల్లో దాచేసి వందే ఇచ్చావని చూపించిన డ్రైవర్
  • నిజమేననుకుని మళ్లీ రూ. 500 ఇచ్చిన యూట్యూబర్
  • వీడియో ఎడిట్ చేస్తుండగా మోసం గుర్తింపు
  • బెంగళూరులో జాగ్రత్తగా ఉండాలంటూ వీడియోను పోస్టు చేసిన యూట్యూబర్ ఫిజ్
Bengaluru auto driver cheats Bangladesh youtuber

బెంగళూరులో ఆటో ప్రయాణం చేసే కొత్తవారు అప్రమత్తంగా ఉండకపోతే బంగ్లాదేశ్ యూట్యూబర్‌కు ఎదురైన అనుభవమే మీకూ ఎదురయ్యే అవకాశం ఉంది. కనురెప్పపాటులో ప్రయాణికులను మభ్యపెట్టి డబ్బులు గుంజేస్తున్నారంటూ యూట్యూబ్‌లో ఆయన పోస్టు చేసిన వీడియో వైరల్ అవుతోంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. బంగ్లాదేశ్‌కు చెందిన యూట్యూబర్ ఎండీ ఫిజ్.. ఫిజ్ పేరుతో యూట్యూబ్ చానల్ నిర్వహిస్తున్నాడు. ఇటీవల భారత్‌కు వచ్చిన ఆయన బెంగళూరులో ఓ ఆటో ఎక్కాడు. 

ప్రయాణం పూర్తయిన తర్వాత డ్రైవర్ చేతికి రూ. 500 ఇస్తే.. క్షణాల్లోనే దానిని తన షర్ట్ చేతి మడతల్లో దాచేసి అప్పటికే చేతిలో రెడీగా పెట్టుకున్న వంద రూపాయల నోటును చూపించి.. మరో రూ. 200 ఇవ్వాలని చెప్పడంతో ఫిజ్ షాకయ్యాడు. తానే పొరపాటు పడ్డానేమో అనుకుని ఆ వంద వెనక్కి తీసుకుని రూ. 500 నోటు ఇచ్చాడు. చిల్లర ఇవ్వబోతుండగా ఉంచుకోమని చెప్పాడు. విచిత్రం ఏమింటే ఫిజ్ తన రైడ్ మొత్తాన్ని వీడియో తీస్తున్న విషయం తెలిసి కూడా డ్రైవర్ మోసం చేయడం.

ఆ తర్వాత తన రైడ్‌ను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసే క్రమంలో జరిగిన మోసాన్ని ఫిజ్ గుర్తించాడు. వీడియోను పోస్టు చేస్తూ బెంగళూరులో ఈ డ్రైవర్ ఆటోను ఎక్కవద్దని సూచించాడు. వీడియో చూసిన నెటిజన్లు కూడా బెంగళూరు ఆటోల్లో ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. కాగా, అధిక చార్జీలు వసూలు చేయడం, రైడ్లకు నిరాకరించడం వంటి కారణాలతో జులై నెలలో ఏకంగా 722 కేసులు డ్రైవర్లపై నమోదయ్యాయి. ఈ వీడియోను మీరూ చూడండి.

More Telugu News