Arvind Kejriwal: మా కూటమి పేరు 'భారత్' అని పెట్టుకుంటే దేశం పేరును బీజేపీగా మారుస్తారా?: కేజ్రీవాల్

  • మా కూటమి పేరును I.N.D.I.A.గా పెట్టుకున్నందుకే పేరు మారుస్తారా? అని ప్రశ్నించిన కేజ్రీవాల్ 
  • ఈ దేశం 140 కోట్ల మందిదని, ఒక పార్టీది కాదని వ్యాఖ్య  
  • పేరు మార్పుపై తనకు అధికారిక సమాచారం లేదని స్పష్టీకరణ
Arvind Kejriwal On India Name Change Buzz

జీ20 విందుకు రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ పంపిన ఆహ్వాన‌ప‌త్రంలో ప్రెసిడెంట్ ఆఫ్ భార‌త్ అని పేర్కొన‌డంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా స్పందించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ... పేరు మార్పుపై తనకైతే అధికారిక సమాచారం లేదని చెబుతూనే, బీజేపీని గద్దెదించేందుకు విపక్షాలు కూటమిగా ఏర్పడి I.N.D.I.A. అని పేరు పెట్టుకున్నాయని గుర్తు చేశారు. తాము అలా పేరు పెట్టుకున్నందుకే కేంద్రం I.N.D.I.A. పేరును తొలగించి భారత్ అని మారుస్తుందా? అని ప్రశ్నించారు. ఈ దేశం 140 కోట్ల మందిదని, ఏదో ఒక పార్టీది కాదన్నారు. ఒకవేళ ప్రతిపక్ష కూటమి I.N.D.I.A. అని కాకుండా భారత్ అని పేరు పెట్టుకుంటే అప్పుడు దేశం పేరును బీజేపీగా మారుస్తారా? అని చురక అంటించారు.

అలాగే, ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా బీజేపీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దేశం ఒక రాజకీయ పార్టీకి చెందినది కాదన్నారు. జీ20 సమ్మిట్ విందు ఆహ్వాన పత్రికలపై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు బదులు ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని పేర్కొనడం అందరిలోను అనుమానాలకు తావిచ్చిందని, పేరు మార్పుపై ఇది చర్చకు దారి తీసిందని పేర్కొన్నారు. ఇష్టానుసారంగా మార్చడానికి ఈ దేశం బీజేపీ సొత్తు కాదన్నారు. జుడేగా భారత్.. జీతేగా ఇండియా అంటూ చద్దా పేర్కొన్నారు.

More Telugu News