Narendra Modi: జూన్ 4వ తేదీతో వైసీపీ ప్రభుత్వానికి ఆఖరు: ప్రధాని మోదీ ట్వీట్

PM Modi says YCP govt will be a thing of past from June 4
  • విజయవాడలో ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ రోడ్ షో
  • రోడ్ షో అంచనాలకు మించి విజయవంతం కావడంతో ప్రధానిలో ఉత్సాహం
  • సందేహమే లేదు... ఏపీ ప్రజలు కూటమివైపేనంటూ ట్వీట్
  • వైసీపీతో ఏపీ ప్రజలు పూర్తిగా విసిగిపోయారని వెల్లడి
  • కూటమి అభ్యర్థులకు భారీ మెజారిటీ ఖాయమని ధీమా

విజయవాడలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ లతో కలిసి ప్రజాగళం రోడ్ షోలో పాల్గొన్న అనంతరం ప్రధాని మోదీ ఆసక్తికర ట్వీట్ చేశారు. విజయవాడలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ లతో తాను పాల్గొన్న రోడ్ షో మరపురానిదని పేర్కొన్నారు. 

గత కొన్ని రోజులుగా తాను ఏపీలో పర్యటిస్తున్నానని, ఏపీ ప్రజలు ఎన్డీయే కూటమి అభ్యర్థులకు భారీగా ఓట్లు వేయనున్నారన్న విషయం అర్థమైందని తెలిపారు. మహిళలు, యువ ఓటర్ల మద్దతుతో ఎన్డీయే అభ్యర్థులకు భారీ మెజారిటీ ఖాయమని ప్రధాని మోదీ పేర్కొన్నారు.  

ఏపీ అధికార పక్షం వైసీపీ పైనా ప్రధాని మోదీ విమర్శలు సంధించారు. కాంగ్రెస్ పార్టీ సంస్కృతితో వైసీపీకి బలమైన అనుబంధం ఉందని, అందుకే ఆ పార్టీ రాష్ట్రంలో అవినీతి, కుటిలత్వం, మాఫియా తత్వాన్ని పెంచి పోషించిందని మోదీ ధ్వజమెత్తారు. వైసీపీతో ఏపీ ప్రజలు పూర్తిగా విసిగిపోయారని, వాళ్ల ప్రభుత్వానికి జూన్ 4వ తేదీతో ఆఖరు అని స్పష్టం చేశారు. 

ఇక బీజేపీ, టీడీపీ గతంలోనూ కలిసి పనిచేశాయని, భవిష్యత్ అభివృద్ధి దిశగా తమది బలమైన బంధం అని స్పష్టం చేశారు. ఎంతో క్రియాశీలకంగా ఉన్న జనసేన పార్టీ వల్ల తమ కూటమి మరింత బలోపేతం అయిందని వివరించారు. తమ ఆకాంక్షలు నెరవేర్చే సత్తా ఈ కూటమికి ఉందని ప్రజలు విశ్వసిస్తున్నారని మోదీ తన ట్వీట్ లో వెల్లడించారు. 

ఏపీలో వ్యవసాయ ఉత్పాదకతను మెరుగుపర్చాలని, పారిశ్రామిక వృద్ధిని పెంచాలని, సేవల రంగంలోనూ ఏపీ తనదైన ముద్రను వేయాలని కోరుకుంటున్నామని తెలిపారు. ఏపీ ప్రజలకు వరప్రసాదం అనదగ్గ ఉత్పాదకశక్తికి అవసరమైన ఉత్తేజాన్ని ఇవ్వాలని భావిస్తున్నామని వివరించారు. 

ఎన్డీయే కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్ర పురోగతి కోసం తీర ప్రాంతాన్ని సద్వినియోగం చేసుకుంటుందని, రాష్ట్రంలో పోర్టుల ఆధారిత అభివృద్ధి జరిగేలా చూస్తామని మోదీ హామీ ఇచ్చారు. అదే సమయంలో మత్స్య రంగానికి గొప్ప ప్రోత్సాహం లభిస్తుందని పేర్కొన్నారు. 

తదుపరి తరం మౌలిక సదుపాయాల రంగానికి తమ ప్రాధాన్యత కొనసాగుతుందని, రహదారుల వ్యవస్థ, రైల్వే వ్యవస్థ, విమానయాన అనుసంధానత అభివృద్ధికి తాము చేయాల్సింది చాలా ఉందని మోదీ తెలిపారు. అంతేకాకుండా, బలమైన డిజిటల్ మౌలిక సదుపాయాల వ్యవస్థను కూడా ఏర్పాటు చేయాలనుకుంటున్నామని వివరించారు.

  • Loading...

More Telugu News