V.V Lakshminarayana: ఇండియా పేరును భారత్‌గా మార్చడం తప్పేమీ కాదు: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

  • రాజ్యాంగంలో ఇండియాతో పాటు భారత్ అనే పేరూ ఉందన్న లక్ష్మీనారాయణ 
  • విదేశీయులు తెచ్చిన పేరును తీసేసి, మన పేరు పెట్టుకుందామనే ఆలోచన కావొచ్చని వ్యాఖ్య
  • ఎన్నో నగరాల పేర్లు మార్చుకున్నాం.. భారత్‌గా దేశం పేరు మార్చడం తప్పు కాదన్న మాజీ జేడీ
  • పేరు మార్పు వల్ల అసలు సమస్యలు పక్కదారి పట్టకుండా చూడాలని సూచన
JD Laxminarayana responds on India to Bharat name change

ఇండియా పేరును భారత్‌గా మారుస్తారనే ప్రచారం నేపథ్యంలో ఈ అంశంపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్పందించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ... రాజ్యాంగంలో ఇండియాతో పాటు భారత్ అనే పేరు కూడా ఉందని గుర్తు చేశారు. ఇండియా అనే పేరు బ్రిటిష్ వాళ్లు ఇచ్చిన పేరు అన్నారు. విదేశీయులు తెచ్చిన పేరును తీసేసి, మనం మన పేరు పెట్టుకుందామనే ఆలోచన కావొచ్చునన్నారు. ఇండియా పేరును భారత్‌గా మార్చడం తప్పేమీ కాదన్నారు. ఇండియా నుండి భారత్‌గా పేరు మార్చాలంటే రాజ్యాంగ సవరణ కూడా చేయాలని స్పష్టం చేశారు. అయినా ఈ పేరు మార్పు వల్ల అసలు సమస్యలు పక్కదారి పట్టకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.

మనం కూడా ఇప్పటి వరకు చాలా పట్టణాల పేర్లు మార్చామని, మద్రాస్‌ను చెన్నైగా, బొంబాయిని ముంబైగా, కలకత్తాను కోల్‌కతాగా ఇలా పలు నగరాల పేర్లు మార్చినట్లు తెలిపారు. అలాగే మన దేశం పేరు కూడా మారుస్తున్నారేమో అన్నారు. ఇండియా స్థానంలో భారత్ పేరు మార్చితే అప్పుడు ఆర్బీఐ, ఎయిమ్స్, ఐఐటీ, ఐపీఎస్, ఐఏఎస్ పేర్లు కూడా మార్చవలసి ఉంటుందన్నారు. వీటిలో ఇండియా అనే పేరు ఉందని గుర్తు చేశారు. అయినా పేరు మార్పుపై చర్చలు జరుగుతున్నాయని, పేరు ఏది మారినా దేశంలోని సమస్యలను దూరం చేయడం అసలు లక్ష్యం కావాలన్నారు.

More Telugu News