Lalit Modi: హరీశ్ సాల్వే వివాహంలో లలిత్ మోదీ ఎంజాయ్.. ఇండియాలో రాజకీయ దుమారం

  • లండన్‌లో తన బ్రిటిష్ భాగస్వామిని మూడో వివాహం చేసుకున్న హరీశ్ సాల్వే
  • నీతా అంబానీ, లక్ష్మీమిట్టల్, ఉజ్వల్ రౌత్‌తోపాటు లలిత్ మోదీ కూడా హాజరు
  • ఎవరు ఎవరిని రక్షిస్తున్నారనేది ఇప్పుడు ప్రశ్నే కాదన్న శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది
Lalit Modis presence at Harish Salve wedding sparks row

భారత క్రికెట్ బోర్డు బీసీసీఐని రూ. 753 కోట్ల మేర మోసం చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొని దేశం విడిచి పరారైన ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ ఎంజాయ్ చేస్తున్నారు. భారత మాజీ సొలిసిటర్ జనరల్ హరీశ్ సాల్వే వివాహంలో ఆయన ఎంచక్కా ఎంజాయ్ చేస్తూ కనిపించారు. హరీశ్ సాల్వే ఆదివారం లండన్‌లో తన బ్రిటిష్ భాగస్వామి ట్రినా‌ను వివాహం చేసుకున్నారు. ఈ వేడుకకు నీతా అంబానీ, లక్ష్మీమిట్టల్, మోడల్ ఉజ్వల్ రౌత్ తదితర హైప్రొఫైల్ సెలబ్రిటీలు హాజరయ్యారు. వీరితోపాటు ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ కూడా రావడంతో అందరి దృష్టి అటువైపు మళ్లింది. అంతేకాదు, భారత్‌లో ఇది రాజకీయ దుమారానికి కారణమైంది. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి.

బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ‘ఒకే దేశం.. ఒకే ఎన్నిక’ కోసం ఏర్పాటు చేసిన అత్యున్నతస్థాయి కమిటీలో హరీశ్ సాల్వే కూడా సభ్యుడిగా ఉన్నారు. ఆయన వివాహానికి లలిత్ మోదీ హాజరు కావడంపై శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది తీవ్రస్థాయిలో స్పందించారు. ప్రభుత్వ ఏకరీతి వివాహ చట్టాలపై ఊదరగొడుతున్న వేళ బీజీపీకి చెందిన లాయర్ మూడో పెళ్లి చేసుకోవడాన్ని తాను పట్టించుకోనని, కాకపోతే మోదీ ప్రభుత్వానికి ఇష్టమైన న్యాయవాది వివాహానికి పారిపోయిన వ్యక్తి ఆహ్వానితుడిగా రావడంపైనే ఆందోళన అంతా అని పేర్కొన్నారు. ఎవరిని ఎవరు రక్షిస్తున్నారనేది ఇప్పుడు ప్రశ్న కానేకాదని ఎక్స్ చేశారు. 

మహారాష్ట్ర కాంగ్రెస్ ప్రధాని కార్యదర్శి ప్రితేశ్ షా కూడా మోదీ ప్రభుత్వంపై మండిపడ్డారు. నీరవ్ మోదీ, లలిత్ మోదీని దొంగలన్నందుకు రాహుల్‌గాంధీపై అనర్హత వేటు వేశారని, కానీ పరారీలో ఉన్న వ్యక్తి.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీలో సభ్యుడైన హరీశ్ సాల్వేతో ఎంజాయ్ చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మోదీజీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ కమిటీ సభ్యుడు ఇద్దరు మోసగాళ్లు లలిత్ మోదీ, మొయిన్ ఖురేషీతో సంతోషంగా గడుపుతున్నారని కాంగ్రెస్ ఓవర్సీస్ కోఆర్డినేటర్ విజయ్ తొట్టితిల్ ఎక్స్ చేశారు. కానీ, భక్తులకు మాత్రం జార్స్ సోరోస్ అనే ఒకేఒక్క మోసం మాత్రమే తెలుసని కాంగ్రెస్ ఓవర్సీస్ ఎక్స్‌లో ఎద్దేవా చేశారు.

More Telugu News