Rains: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక

  • రానున్న 3-5 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయన్న ఐఎండీ 
  • తెలంగాణలోని 9 జిల్లాలకు ఎల్లో అలర్ట్, 18 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
  • కోస్తా ఆంధ్రకు భారీ వర్ష సూచన
  • ఇప్పటికే పలు జిల్లాలలో కుండపోత వర్షాలు, పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు
  • హైదరాబాద్‌లో తెల్లవారుజామునుంచి దంచి కొడుతున్న వర్షం
  • నగరంలో లోతట్టు ప్రాంతాలు జలమయం 
IMD forecasts heavy rains for telugu states in the next three days

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఉపరితల అవర్తనం ఇవాళ అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ఫలితంగా తెలంగాణలో మరో ఐదు రోజులు, ఏపీలో మరో మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే కురుస్తున్న వానలతో పలు జిల్లాల్లో వాగులు వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. తెలంగాణలోని తొమ్మిది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరో 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. నేడు జగిత్యాల, వికారాబాద్, కరీంనగర్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భూపాలపల్లి, ఖమ్మం, నల్గొండ, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. 

ఇక కోస్తా ఆంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని కూడా ఐఎమ్‌డీ హెచ్చరించింది. ఇప్పటికే ఏపీ అంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలో వాన బీభత్సం సృష్టించింది. నామనంక పల్లి దగ్గర వాగులు ఉప్పొంగడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. 

రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులకు వరద నీరు పోటెత్తింది. నిజాంసాగర్ జలకళను సంతరించుకుంది. 36,500 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లో వస్తుండటంతో ప్రాజెక్టు ఐదు గేట్లను ఎత్తేశారు. శ్రీరాంసాగర్‌కు కూడా వరద ఉద్ధృతి పెరిగింది. ఇన్‌ఫ్లో 62 వేల క్యూసెక్కులుగా ఉండటంతో పదహారు గేట్లు ఎత్తి నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. 

హైదరాబాద్‌లో మరోసారి కుండపోత వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచీ భారీ వర్షం పడుతుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై భారీగా నీరు వచ్చి చేరుతోంది. మరో మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

More Telugu News