Onion Price: ఉల్లి ధరలు పెరుగుతున్నాయ్.. కిలో రూ. 40కి చేరిక

  • ఏపీలో పడిపోయిన ఉల్లి ఉత్పత్తి
  • రైతు బజార్లలోనే కిలో ఉల్లి రూ. 30కి విక్రయం
  • తాడేపల్లిగూడెం మార్కెట్‌కు తగ్గిన ఉల్లిరాక
  • మున్ముందు ధరలు మరింత పెరిగే అవకాశం
Onion Price rocketing in Andhra Pradesh

ఏపీలో ఉల్లి ధరలు పెరుగుతున్నాయి. రైతు బజార్లలోనే కిలో రూ. 30 పలుకుతుండగా, బహిరంగ మార్కెట్లో రూ. 35 నుంచి రూ. 40 వరకు విక్రయిస్తున్నారు. మార్చితో పోలిస్తే కిలోకు 150 శాతానికిపైగా పెరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో ఉల్లిసాగు తగ్గడం, పొరుగు రాష్ట్రం కర్ణాటకలోనూ కొత్తపంట చేతికి రాకపోవడమే ధరల పెరుగుదలకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు. 

నాఫెడ్ ద్వారా ఉల్లిని సేకరించి మార్కెట్లో విడుదల చేస్తున్నా ధరల పెరుగుదలకు మాత్రం కళ్లెం పడడం లేదు. ఇటీవల రూ. 200 వరకు చేరిన కిలో టమాటా ధర ప్రస్తుతం రూ. 35కు పడిపోయింది. దీంతో ఉల్లి ధరలు కూడా ఎక్కడ ఆకాశాన్ని తాకుతాయోనన్న భయం వినియోగదారులను వేధిస్తోంది. మొన్నటివరకు ఏపీలోని తాడేపల్లిగూడెం మార్కెట్‌కు రోజుకు 80-90 లారీలు వచ్చేవి. ఇప్పుడు ఉల్లి ఉత్పత్తి తగ్గడంతో ఒకటి రెండు లారీలు మాత్రమే వస్తున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. 15 రోజుల నుంచి నాఫెడ్ ద్వారా రోజూ 15 లారీల ఉల్లి వస్తోంది. 

మార్చిలో ఉల్లి ధర కిలోకు రూ. 15 ఉండగా ఈ నెలలో అది రెట్టింపు అయింది. నిన్న విజయవాడ రైతు బజార్‌లో కిలో రూ. 30కి విక్రయించారు. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో రూ. 40 వరకు పలికింది.ఈ నేపథ్యంలో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

More Telugu News