Chandramukhi-2: వినాయక చవితికి వస్తున్న చంద్రముఖి-2... ఆసక్తి రేకెత్తిస్తున్న ట్రైలర్

  • రాఘవ లారెన్స్, కంగనా ప్రధానపాత్రల్లో చంద్రముఖి-2
  • నేడు ట్రైలర్ విడుదల చేసిన చిత్రబృందం
  • సెప్టెంబరు 15న చంద్రముఖి-2 గ్రాండ్ రిలీజ్
Chandramukhi2 trailer out now

ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు రాఘ‌వ లారెన్స్‌, బాలీవుడ్ ముద్దుగుమ్మ కంగ‌నా ర‌నౌత్ నటించిన భారీ చిత్రం చంద్రముఖి-2. గతంలో రజనీకాంత్ హీరోగా వచ్చిన చంద్రముఖి చిత్రాన్ని తెరకెక్కించిన పి.వాసు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. 

లైకా ప్రొడ‌క్ష‌న్స్ పై భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 15న తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. తెలుగు రాష్ట్రాల్లో ‘చంద్రముఖి 2’ చిత్రాన్ని రాధాకృష్ణ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై వెంక‌ట్ ఉప్పుటూరి, వెంక‌ట ర‌త్నం శాఖ‌మూరి రిలీజ్ చేస్తున్నారు. 

ఈ నేపథ్యంలో, నేడు చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు. ట్రైలర్ అత్యంత ఆసక్తికరంగా ఉంది. ఓ థ్రిల్లర్ సినిమాకు ఉండాల్సిన హంగులన్నీ చంద్రముఖి-2 చిత్రానికి ఉన్నట్టు ట్రైలర్ చెబుతోంది. 

17 సంవత్స‌రాల క్రితం చంద్ర‌ముఖి తాను బందీగా ఉంటున్న గ‌ది త‌లుపులు తెరుచుకుని వేట్ట‌య రాజాపై ప‌గ తీర్చుకోవ‌టానికి ప్రయ‌త్నించి విఫ‌ల‌మైంది. ఇన్నేళ్ల త‌ర్వాత మ‌ళ్లీ ఇప్పుడు త‌న ప‌గ తీర్చుకోవ‌టానికి వ‌చ్చేస్తోంది. అదెప్పుడు... ఎక్క‌డ‌... ఎలా అనేది తెలుసుకోవాలంటే సెప్టెంబ‌ర్ 15 వ‌ర‌కు ఆగాల్సిందేనంటున్నారు మేక‌ర్స్‌.

ఇందులో రాఘవ లారెన్స్ రెండు షేడ్స్‌లో మెప్పిస్తున్నారు. ఒక‌టి స్టైలిష్ లుక్ కాగా... మ‌రొకటి వేట్ట‌య రాజా లుక్‌. ఇక చంద్ర‌ముఖి పాత్ర‌లో కంగనా ర‌నౌత్ ఒదిగిపోయింది. బ‌స‌వ‌య్య పాత్ర‌లో స్టార్ క‌మెడియ‌న్ వ‌డివేలు త‌న‌దైన కామెడీతో మెప్పించ‌బోతున్నారు. 

ఈ చిత్రానికి ఆస్కార్ విన్న‌ర్ ఎం.ఎం.కీర‌వాణి సంగీతం అందించడం హైలైట్ అని చెప్పాలి. ముఖ్యంగా, కీరవాణి నేప‌థ్య సంగీతం అదిరిపోతుందని చిత్రబృందం చెబుతోంది. ఆర్‌.డి.రాజ‌శేఖ‌ర్ సినిమాటోగ్ర‌ఫీ కూడా ఆకట్టుకునేలా ఉందని ట్రైల‌ర్ చూస్తుంటే స్ప‌ష్ట‌మ‌వుతోంది. ట్రైల‌ర్ సినిమాపై ఉన్న ఎక్స్‌పెక్టేష‌న్స్‌ను మరింత పెంచుతోంది. ‘చంద్ర‌ముఖి 2’తో డైరెక్ట‌ర్ పి.వాసు సిల్వ‌ర్ స్క్రీన్‌పై మ‌రోసారి ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేయ‌బోతున్నారోన‌ని అంద‌రూ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. 

ఈ చిత్రంలో ల‌క్ష్మీ మీన‌న్‌, మ‌హిమా నంబియార్‌, రాధికా శ‌ర‌త్ కుమార్‌, విఘ్నేష్‌, ర‌విమారియ, శృష్టి డాంగే, శుభిక్ష‌, వై.జి.మ‌హేంద్ర‌న్ రావు ర‌మేష్‌, సాయి అయ్య‌ప్ప‌న్, సురేష్ మీన‌న్‌, శత్రు, టి.ఎం.కార్తీక్‌ ఇతర పాత్రలు పోషించారు.

More Telugu News