Hyderabad District: వర్షానికి తడిసి ముద్దయిన భాగ్యనగరం.. ప్రజల్లో హర్షం

  • బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా తెలంగాణలోని పలుప్రాంతాల్లో వర్షాలు
  • ఆదివారం తెల్లవారుజాము నుంచి హైదరాబాద్‌లో వర్షం
  • గ్రీష్మతాపం నుంచి ఊరట దక్కడంతో ప్రజల్లో హర్షం
  • సోమ, మంగళవారాల్లోనూ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు 
  • తెలంగాణకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్
Hyderabad rains on sunday morning

గత కొన్ని రోజులుగా వర్షాలు లేక ఉక్కపోతతో సతమతమవుతున్న తెలంగాణ ప్రజలను ఆదివారం వరుణుడు పలకరించాడు. శనివారం రాత్రి నుంచి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుండటంతో ప్రజలకు గ్రీష్మతాపం నుంచి ఉపశమనం లభించింది. ఇక, ఆదివారం ఉదయం నుంచీ హైదరాబాద్ నగరంలో వర్షం కురుస్తోంది. గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీ, కృష్ణానగర్, ఫిలింనగర్, అమీర్‌పేట్, పంజాగుట్ట, ఎస్ఆర్ నగర్, షేక్ పేట, మణికొండ, రాయదుర్గం, మెహిదీపట్నం, టోలీచౌకీ, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌తో పాటూ పలు ఇతర ప్రాంతాల్లో జోరుగా వర్షం కురుస్తోంది. బాలానగర్, కూకట్ పల్లి ప్రాంతంలో వర్షం దంచికొడుతోంది. ఫలితంగా, నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకి అంతరాయం ఏర్పడింది. 

బంగాళాఖాతంలోని అల్పపీడనం కారణంగా తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. సోమ, మంగళవారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. గంటకు 30 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. అల్పపీడనం కారణంగా వాతావరణ శాఖ తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

More Telugu News